కంపెనీ బంపర్ ఆఫర్.. ఉద్యోగులకు సంస్థలో వాటాలు, కార్లు

Byline :  Veerendra Prasad
Update: 2024-01-04 03:04 GMT

చెన్నైకి చెందిన ఓ ఐటీ సంస్థ.. తమ సంస్థలో పనిచేసే ఉద్యోగులకు జీవితంలో మరచిపోలేని గిఫ్ట్‌ ఇచ్చింది. ఏకంగా కంపెనీలోని వాటాలను అందిస్తున్నట్లు ప్రకటించింది. ఉద్యోగులకు సంస్థలో 33 శాతం వాటా ఇచ్చింది. కంపెనీ స్థాపించినప్పటి నుంచీ పనిచేస్తున్న 40 మందికి అందులో 5 శాతం కాగా.. మిగిలిన వారికి మిగతా వాటా ఇస్తున్నట్లు ప్రకటించింది.

తమిళనాడుకు చెందిన ఐడియాస్‌2ఐటీ అనే హై-ఎండ్ ప్రొడక్ట్ ఇంజనీరింగ్ కంపెనీ చెన్నై కేంద్రంగా పని చేస్తోంది. ఒకప్పుడు చిన్న కంపెనీగా మొదలై నేడు 700ల మంది పని చేసే స్థాయికి చేరుకుంది. అయితే పదేళ్ల కిందట ఈ కంపెనీ ప్రస్థానం మొదలైనప్పుడు.. ముందుగా నిర్దేశించుకున్న లక్ష్యాలను కనుక చేరితే కంపెనీ లాభాలను ఉద్యోగులకు పంచి ఇస్తామంటూ ప్రకటించింది. అందులో భాగంగానే కంపెనీ అభివృద్ధికి పాటుపడిన వారి కష్టాన్ని గుర్తించి, ఇప్పటివరకూ ఈఎస్‌ఓపీలు, బోనస్‌లు, గిఫ్ట్‌లు, ఇన్సెంటివ్ లు, ప్రాఫిట్ షేరింగ్ లేదా ఇతర స్టాక్ ఆఫ్షన్లను ఇచ్చింది.

ప్రస్తుతం కంపెనీ మరింత లాభాల బాటలో పయనిస్తుండడంతో ఉద్యోగులకు కంపెనీలో 33 శాతం వాటా అందిస్తున్నట్లు పేర్కొంది. కంపెనీ స్థాపించినప్పటి నుంచి పనిచేస్తున్న 40 మందికి 5 శాతం వాటా.. ఇతర ఉద్యోగులకు మిగిలిన వాటా ఇవ్వనుంది. ఈ వాటాను నియంత్రిత స్టాక్‌ యూనిట్ల (Restricted stock units) రూపంలో అందించనున్నట్లు కంపెనీ ఫౌండర్ మురళీ వివేకానందన్‌ తెలిపారు. 'కంపెనీ ఎదుగుదలకు తోడుగా నిలిచిన వారిలో ప్రతిభను గుర్తించి ప్రోత్సాహకాలు అందించాలనుకున్నాం. ఈ చర్యతో వారు కేవలం సంస్థలో వాటాదారులే కాకుండా కంపెనీ విజయాల్లో నిజమైన భాగస్వాములవుతారు. మేం తలపెట్టిన ఈ కార్యక్రమం ఇతర సంస్థలకు స్ఫూర్తిగా నిలుస్తుంది’ అని వివేకానందన్‌ అన్నారు. ఐడియాస్‌2ఐటీ ఇప్పటికే అనేక సార్లు తమ ఉద్యోగులకు కార్లను కానుకలుగా అందించింది. మంగళవారం కూడా 50 మంది ఉద్యోగులను ఎంపిక చేసి వారికి కార్లను అందించింది.

Tags:    

Similar News