Christmas Celebrations: హ్యాపీ క్రిస్మస్.. ప్రజలకు శుభాకాంక్షలు తెలిపిన నాయకులు..

Byline :  Veerendra Prasad
Update: 2023-12-25 01:35 GMT

ఏసు క్రీస్తు జన్మదినం పురస్కరించుకుని నేడు(డిసెంబర్ 25న) ప్రపంచవ్యాప్తంగా క్రిస్మస్ వేడుకలు ప్రారంభమయ్యాయి. దేశమంతా క్రిస్మస్‌ సంబరాలు అంబరాన్ని తాకుతున్నాయి. విద్యుత్ కాంతుల్లో చర్చిలు వెలిగిపోతున్నాయి. పలువురు ప్రముఖులు దేశ ప్రజలకు క్రిస్మస్‌ శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము దేశ ప్రజలకు క్రిస్మస్‌ శుభాకాంక్షలు తెలిపారు. ‘‘క్రిస్మస్‌ను పురస్కరించుకుని ప్రజలు కరుణ, దయ నుంచి ప్రేరణ పొందాలి. క్రిస్మస్‌ పర్వదినం ప్రేమ, దయాగుణం విశిష్టతను మరోసారి మనకు గుర్తుచేస్తుంది. మానవాళికి నిస్వార్థంగా ఎలా సేవ చేసి తరించాలో ఈ పండుగ మనకు చాటి చెబుతుంది. సమాజంలో శాంతి సౌభ్రాతృత్వాలు వెల్లివిరియాలంటే మనం ఎలాంటి ఆదర్శమయ జీవితం గడపాలో ఏసు క్రీస్తు బోధనలు మనకు విడమరిచి చెబుతాయి. ఇంతటి పర్వదినాన తోటి పౌరులు, ముఖ్యంగా క్రైస్తవ సోదర, సోదరీమణులకు నా హృదయపూర్వక క్రిస్మస్‌ శుభాకాంక్షలు’’ అని రాష్ట్రపతి ఆదివారం తన సందేశంలో పేర్కొన్నారు.

ఇక రాష్ట్రంలో కూడా క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఆదివారం అర్ధరాత్రి తరువాత చర్చీల్లో క్రైస్తవులు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. మెదక్‌లోని ప్రపంచ ప్రఖ్యాత సీఎస్‌ఐ చర్చిలో సోమవారం తెల్లవారుజామున క్రిస్మస్‌ వేడుకలు ప్రారంభమయ్యాయి. ఏసుక్రీస్తు జన్మవృత్తాంతాన్ని తెలిపే పశువుల పాక, క్రిస్మస్‌ ట్రీ, పునరుత్థానానికి చిహ్నంగా ఏర్పాటు చేసిన నక్షత్రాలతో చర్చి కొత్త శోభ సంతరించుకున్నది. మరోవైపు ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి, ఉపముఖ్యమంత్రి భట్టి,బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ సహా పలువురు ప్రముఖులు క్రిస్మస్‌ శుభాకాంక్షలు తెలిపారు.

ఒడిశా లోని పూరిలో శాంటాక్లాజ్‌ సైకత శిల్పాన్ని అందంగా తీర్చిదిద్దారు శిల్పి సుదర్శన్‌ పట్నాయక్‌. ఉల్లిగడ్డలతో క్రిస్మస్‌ తాతయ్యను అందంగా అలంకరించి తన సత్తాను మరోసారి చాటుకున్నారు. పూరి బీచ్‌లో ఆనియన్‌ సైకతశిల్పం ప్రపంచం దృష్టిని ఆకర్షిస్తుందన్నారు సుదర్శన్‌ పట్నాయక్‌ . వరల్డ్‌ రికార్డ్స్‌ ఆఫ్‌ ఇండియాలో ఈ సైకత శిల్పం రికార్డును సొంతం చేసుకుంది. పర్యావరణాన్ని ప్రతి ఒక్కరు కాపాడాలన్న థీమతో ఈ సైకత శిల్పాన్ని క్రిస్మస్‌ సందర్భంగా రూపొందిచనట్టు తెలిపారు సుదర్శన్‌ పట్నాయక్‌.

Tags:    

Similar News