CM Revanth Reddy : జార్ఖండ్కు సీఎం రేవంత్.. రాహుల్తో కలిసి..
రాహుల్ గాంధీ భారత్ న్యాయ్ యాత్ర జార్ఖండ్లో కొనసాగుతోంది. ఈ యాత్రలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొననున్నారు. ప్రత్యేక విమానంలో డిప్యూటీ సీఎం భట్టి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డితో కలిసి ఆయన రాంచీ వెళ్లనున్నారు. రాహుల్ యాత్రలో వీరంతా పాల్గొననున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు జరిగే అక్కడి సభలో రాహుల్తో పాటు సీఎం పాల్గొంటారు. ఇవాళ రేవంత్ కొడంగల్లో పర్యటించాల్సి ఉంది. అయితే జార్ఖండ్ పరిణామాల దృష్ట్యా ఆయన అక్కడికి వెళ్లనున్నారు.
మరోవైపు ఇవాళ జార్ఖండ్ అసెంబ్లీలో బలపరీక్ష జరగనుంది. సీఎం చంపై సోరెన్ తన బలాన్ని నిరూపించుకోనున్నారు. గత నాలుగు రోజుల నుంచి హైదరాబాద్ లోనే ఉన్న జేఎంఎం-కాంగ్రెస్ కూటమి ఎమ్మెల్యేలు జార్ఖండ్కు తిరిగి వెళ్లారు. జార్ఖండ్లో మొత్తం 81 అసెంబ్లీ స్థానాలున్నాయి. ప్రస్తుతం జేఎంఎంకు 29 మంది ఎమ్మెల్యేలు ఉండగా.. కాంగ్రెస్ కు 17, ఎన్సీపీ, ఆర్జేడీ, సీపీఐఎంల్ కు చెరొక ఎమ్మెల్యే చొప్పున ఉన్నారు. ఇక బీజేపీ బలం 26 కాగా, ఏజేఎస్యూకు 3, ఇద్దరు ఇండిపెండెంట్ ఎమ్మెల్యేలు ఉన్నారు.
జేఎంఎం, కాంగ్రెస్, ఎన్సీపీ, ఆర్జేడీ, సీపీఐఎంల్ కూటమికి 49 మంది సభ్యులు ఉండగా.. ప్రతిపక్ష పార్టీలకు 31 మంది సభ్యుల బలం ఉంది. ఈ క్రమంలో బలపరీక్షలో తమదే విజయం అని చంపై ధీమాతో ఉన్నారు. బలపరీక్ష ఎదుర్కోవడం జేఎమ్ఎమ్‌కు ఇదేం తొలిసారి కాదు. 2022 సెప్టెంబర్‌లో జరిగిన బలపరీక్షలో 48 ఎమ్మెల్యేల మద్దతుతో జేఎమ్ఎమ్ అధికారం దక్కించుకుంది. గతంలో కూడా హేమంత్ సోరెన్ అవినీతి ఆరోపణలు ఎదుర్కొని బలపరీక్షను ఎదుర్కొన్నారు. ఈ బలపరీక్షలో హేమంత్ సోరెన్ ఓటేసేందుకు కోర్టు అనుమతించింది.