తమిళనాడులోని కోయంబత్తూరులో తొలి మహిళా డ్రైవర్గా పేరొందిన షర్మిల తన ఉద్యోగాన్ని కోల్పోయింది. ఎంపీ కనిమొళి అభినందించిన కాసేపటికే షర్మిల ఉద్యోగం ఊడింది. పబ్లిషిటీ కోసమే ప్రముఖలను ఆమె ఆహ్వానిస్తుందంటూ..దీంతో తమకు నష్టం కలుగుతోందని బస్సు యజమాని ఆమెను ఉద్యోగం నుంచి తొలగించినట్టు ప్రచారం జరుగుతోంది. అయితే యజమాని మాత్రం..షర్మిలయే రాజీనామా చేసి వెళ్లిపోయిందని చెబుతున్నారు.
ఏం జరిగిందంటే..
రాష్ట్రంలోనే మొదటి మహిళా బస్సు డ్రైవర్గా షర్మిల విధులు చేపట్టారు. దీంతో పలువురు రాజకీయ నాయకులు వచ్చి ఆమెకు అభినందనలు తెలుపుతున్నారు. ఎంపీ కనిమొళి శుక్రవారం షర్మిల నడుపుతున్న బస్సు ఎక్కి ఆమెను అభినందించారు. ఈ సమయంలో కండెక్టర్‌కు ఎంపీ అనుచరులకు మధ్య టికెట్ల విషయంలో వాగ్వాదం చోటుచేసుకుంది. అనంతరం విషయం బస్సు యజమాని వద్దకు వెల్లడంతో షర్మిలను మందలించినట్టు తెలుస్తోంది. దీంతో ఆమె రాజీనామా చేసి వెళ్లిపోయినట్టు సమాచారం. ఈ ఘటనపై ఎంపీ కనిమొళి స్పందిస్తూ.. ఉద్యోగం కోల్పోయిన డ్రైవర్ షర్మిలను అన్ని విధాలా ఆదుకుంటామని చెప్పారు.