రాజ్యసభకు ఏకగ్రీవం.. పెద్దల సభకు సోనియా..

By :  Kiran
Update: 2024-02-20 13:22 GMT

కాంగ్రెస్ సీనియర్ నేత సోనియా గాంధీ పెద్దల సభలో అడుగుపెట్టనున్నారు. దాదాపు 25 ఏండ్ల పాటు లోక్ సభకు ప్రాతినిధ్యం వహించిన ఆమె.. రాజ్యసభకు ఎన్నికయ్యారు. రాజస్థాన్ నుంచి సోనియా ఎన్నిక ఏకగ్రీవమైంది. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ స్థానాన్ని ఆమె భర్తీ చేయనున్నారు. రాజస్థాన్ నుంచి రాజ్యసభలో అడుగుపెట్టిన ఆయన పదవీకాలం ఈ ఏడాది ఏప్రిల్ 3తో ముగియనుంది. దీంతో ఆ స్థానానికి జరిగిన ఎన్నిక నోటిఫికేషన్ రిలీజ్ కాగా సోనియా గాంధీ ఒక్కరే నామినేషన్ దాఖలు చేశారు. మంగళవారం నామినేషన్ల ఉపసంహరణకు గడువు ముగిసింది. సోనియా మినహా ఇంకెవరూ పోటీలో లేకపోవడంతో ఆమె ఎన్నిక ఏకగ్రీవమైంది.

బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా సైతం గుజరాత్ నుంచి ఎలాంటి పోటీ లేకుండా రాజ్యసభకు ఎన్నికయ్యారు. రాజస్థాన్ నుంచి ఖాళీ కానున్న మరో రెండు రాజ్యసభ స్థానాల్లో బీజేపీకి చెందిన చున్నిలాల్‌ గరాసియా, మదన్‌రాథోడ్‌ నామినేషన్‌ వేశారు. పోటీలో ఇంకెవరూ లేకపోవడంతో ఈ ముగ్గురూ ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు రిటర్నింగ్‌ అధికారి వెల్లడించారు. రాజస్థాన్లో మొత్తం 10 రాజ్యసభ సీట్లుండగా.. తాజా ఫలితాలతో కాంగ్రెస్‌కు ఆరు, బీజేపీకి నలుగురు సభ్యులున్నారు.

అటు గుజరాత్‌లో ఖాళీ కానున్న నాలుగు స్థానాల్లో బీజేపీ జాతీయాధ్యక్షుడు నడ్డా సహా అదే పార్టీకి చెందిన నలుగురు పోటీకి దిగారు. పోటీలో ఎవరూ లేకపోవడంతో ఆ నాలుగు సీట్లు బీజేపీకే దక్కాయి. 2012, 2018లో నడ్డా హిమాచల్‌ ప్రదేశ్ నుంచి రాజ్యసభకు ప్రాతినిధ్యం వహించారు. ప్రస్తుతం అక్కడ బీజేపీకి తగినంత సంఖ్యాబలం లేకపోవడంతో ఆయనను గుజరాత్‌కు మార్చారు.




Tags:    

Similar News