ఊర్ల పేర్లు, భవనాల పేర్లు వరసబెట్టి మారుస్తున్న మోదీ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం తీసుకుంది. దేశ రాజధాని ఢిల్లోని దశాబ్దాల నాటి ‘నెహ్రూ మెమోరియల్ మ్యూజియం అండ్ లైబ్రరీ సొసైటే’(ఎన్ఎంఎంఎల్) పేరును మార్చేసింది. ఆ భవనాన్ని ఇకనుంచి ‘ప్రధానమంత్రుల స్మారకచిహ్నం’(పీఎంఎంఎల్) పేరుతో వ్యవహరించాలని ఉత్తర్వులు జారీ చేసింది. ‘‘ప్రజాస్వామ్యానికి, భిన్నత్వానికి తగినట్టు ఈ నిర్ణయం తీసుకున్నాం’’ అని సంస్థ వైస్ చైర్మన్ సూర్యప్రకాశ్ ట్వీట్ చేశారు.
పేరు మార్పుపై కాంగ్రెస్ భగ్గుమంది. బీజేపీ ప్రభుత్వం గాంధీ నెహ్రూల పేర్లను చరిత్ర నుంచి తొలగించాలని కుట్ర పన్నుతోందని పార్టీ నేత జైరామ్ రమేశ్ మండిపడ్డారు. ‘‘జాతి నిర్మాత నెహ్రూ వారసత్వాన్ని తిరస్కరిస్తున్నారు. పేరు మార్చి చరిత్రను వక్రీకరిస్తూ అగౌరవిస్తున్నారు. స్వాతంత్ర్య పోరాటంలో, భారత్‌ను ప్రజాస్వామ్య, లౌకిక, ఉదారవాదం దేశాంగా తీర్చిదిద్దిన నెహ్రూపై మోదీ, ఆయన తాబేదార్లు దాడి చేస్తున్నారు ’’ అని దుయ్యబట్టారు. ఈ భవనానికి గతంలో తీన్ మూర్తి భవన్ అనే పేరుండేంది. నెహ్రూ మరణానంతరం ఆయన పేరు పెట్టారు. గత 14 మంది ప్రధాన మంత్రులు దేశానికి చేసిన సేవలను స్మరించుకుంట మోదీ ప్రభుత్వం అందులో ప్రధానమంత్రి సంగ్రహాలయాన్ని ఏర్పాటు చేసింది.