Cyclone Michaung : అతలాకుతలమైన చెన్నై.. జనజీవనం అస్తవ్యస్తం
మిచాంగ్ తుఫాన్ ధాటికి తమిళనాడు అస్తవ్యవమైంది. భారీ వర్షాలతో చెన్నై నగరం చిగురుటాకుల వణుకుతోంది. నగరం మొత్తం జలదిగ్భంధం అవ్వగా.. జనజీవనం అష్టకష్టాలు పడుతోంది. కుండపోత వానకు రోడ్లపై ఉన్న కార్లు, వాహనాలు కొట్టుకపోయాయి. వర్షం కారణంగా ప్రజలు తాగునీరు, నిత్యావసర సరుకుల కోసం పరుగులు తీయాల్సి వస్తోంది. ఈదురు గాలులతో కూడిన కుండపోత వర్షం కారణంగా నగరంలోని పలు ప్రాంతాల్లో విద్యుత్ స్తంభించి ఇంటర్నెట్ సేవలకు అంతరాయం ఏర్పడింది.
చెన్నై ఎయిర్‌పోర్టులో భారీగా వరద చేరడంతో విమానాల రాకపోకలు నిలిచిపోయాయి. సుమారు 160 మిమాన సేవలు రద్దవ్వగా.. 33 విమానాలను దారిమళ్లించారు. భారీ వర్షాల కారణంగా చెన్నైలోని రజనీకాంత్ వంటి ప్రముఖులుండే పోయెస్ గార్డెన్ హైవే 7 అడుగుల మేర కుంగింది. ప్రభుత్వం సహాయక చర్యలను ముమ్మరం చేసింది. వరద బాధితుల కోసం 121 షెల్టర్లు, 5వేల రిలీఫ్ సెంటర్లను ఏర్పాటు చేసింది. లోతట్టు ప్రాంతాల్లోని 685 మందిని క్యాంపులకు తరలించారు. ప్రజలు అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దని ప్రభుత్వం సూచించింది. భారీ వర్షాల నేపథ్యంలో ఇవాళ సెలవు ప్రకటించింది.
మిచాంగ్ తుఫాన్ ప్రభావంతో చెన్నైలో గత 47ఏళ్లలో అత్యంత భారీ వర్షంగా నమోదైంది. 2015లో చెన్నైలో కుంభవృష్టి కురిసింది. అప్పట్లో చాలా ప్రాంతాలు నీటమునిగి.. జనజీవనం అస్తవ్యస్తమైంది. ప్రస్తుతం మిచాంగ్ తుపాను వల్ల అంతకుమించి వర్షపాతం నమోదైంది. 2015లో చెన్నై వరద నగరాన్ని ముంచెత్తినప్పుడు 330 మిల్లీమీటర్ల వర్షం కురవగా.. గత రెండు రోజులుగా 400 నుంచి 500 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. అప్పటి కష్టాలు పునరావృతం కాకుండా చేసేందుకు డీఎంకే ప్రభుత్వం నగరంలోని రూ.4వేల కోట్లతో నిర్మించిన వరద కాల్వలు పూర్తిగా వాడకంలోకి రాకపోవటంతో ఈసారీ ముంపు సమస్య తలెత్తింది.