Cyclone Michaung : తీరాన్ని తాకిన తుఫాన్.. ఏపీలో భారీ వర్షం
మిగ్‌జాం తుఫాను బాపట్ల సమీపంలో తీరాన్ని తాకింది. మరో గంట వ్యవధిలో తీరాన్ని దాటుతుందని వాతావరణ శాఖ అధికారులు ప్రకటించారు. తీరం దాటిన తర్వాత సాయంత్రానికి బలహీనపడనున్న మిగ్ జాం తుఫాను వాయుగుండంగా మారే అవకాశముంది. తుఫాను తీరం దాటుతుండటంతో బాపట్ల తీర ప్రాంతంలో భారీ ఈదురు గాలులతో కూడిన వర్షం కురుస్తోంది. మిగ్ జాం కారణంగా సముద్రం అల్లకల్లోలంగా మారింది. అలలు దాదాపు 2మీటర్ల మేర ఎగిసిపడుతున్నాయి.
తుఫాన్ దృష్ట్యా సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సమీక్షా సమావేశం నిర్వహించారు. తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో పరిస్థితులపై ఆరా తీశారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో రెవెన్యూ, విపత్తు నిర్వహణ శాఖ స్పెషల్ సీఎస్ జి సాయి ప్రసాద్, సీసీఎల్‌ఏ సెక్రటరీ ఇంతియాజ్, సీఎంఓ అధికారులతో సీఎం జగన్ భేటీ అయ్యారు. బాధితులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని అన్ని సౌకర్యాలు కల్పించాలని అధికారులను ఆదేశించారు. నెల్లూరు, తిరుపతి సహా తుఫాన్ వల్ల దెబ్బతిన్న ప్రాంతాల్లో కరెంటు సరఫరా వ్యవస్థను యుద్ధ ప్రాతిపదికన పునరుద్ధరించాలని చెప్పారు. గ్రామ, వార్డు సచివాలయ, వాలంటీర్ వ్యవస్ధలను వాడుకుని రేషన్ పంపిణీ సమర్ధవంతంగా చేపట్టాలని సీఎం జగన్ సూచించారు.