ఈ నెల 22న ప్రభుత్వం సెలవు ప్రకటించాలి..బీజేపీ నేత పురంధేశ్వరి
అయోధ్యలో శ్రీరాముడి విగ్రహ ప్రాణప్రతిష్ట రోజు ఏపీలో సెలవుగా ప్రకటించాలని అక్కడి బీజేపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. సంక్రాంతి సెలవులు మరో 3 రోజులు పొడిగిస్తూ ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న విషయం విదితమే. దీంతో.. రాష్ట్రంలో ఈ నెల 22న పాఠశాలలు పునఃప్రారంభం కానున్నాయి. అయితే, ఏపీలో 21వ తేదీ వరకు మాత్రమే సెలవు ప్రకటించారు. 22వ తేదీన దేశం మొత్తం చాలా రాష్ట్రాల్లో విద్యా సంస్థలు సెలవు ప్రకటించారు. ఏపీ ప్రభుత్వం మాత్రం అందుకు భిన్నంగా ఆ రోజు సెలవు ప్రకటించలేదని బీజేపీ ఏపీ రాష్ట్ర కార్యదర్శి దగ్గుబాటి పురంధేశ్వరి దుయ్యబట్టారు.
రామ మందిరం ప్రారంభం భారతీయుల శతాబ్దాల కల, దశాబ్దాల పోరాటమని పేర్కొన్న పురంధేశ్వరి.. 21వ తేదీ వరకు మాత్రమే జగన్ ప్రభుత్వం సెలవులు ఇచ్చి, 22 న ఇవ్వకపోవడం వెనక దురుద్దేశం ఉందని అర్థమవుతుందని విమర్శించారు. 22వ తేదీన కూడా సెలవు ప్రకటించాల్సి ఉన్నా.. ఉద్దేశపూర్వకంగానే ఆరోజు సెలవు ఇవ్వలేదన్నారు. ఇప్పటికే ప్రైవేటు విద్యా సంస్థలు సెలవులు ప్రకటించాయని గుర్తుచేశారు. ఇక, రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహావిష్కరణ వల్ల 21వ తేదీ వరకు సెలవు ఇవ్వడాన్ని బీజేపీ పక్షాన హర్షం వ్యక్తం చేస్తున్నట్లు తెలిపారు. అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా అన్ని వర్గాల వారికి మోడీ చేయూతను ఇచ్చారని తెలిపారు.