Delhi : ఆరవ రోజుకు చేరుకున్న రైతుల ఢిల్లీ చలో....నేడు కేంద్రంతో మరోసారి చర్చలు
దేశరాజధాని ఢిల్లీలో రైతుల ఆందోళనలు ఆరవరోజుకు చేరుకున్నాయి. తమ డిమాండ్ల సాధన కోసం పంజాబ్, హర్యానా రైతులు ఢిల్లీ ఛలో కార్యక్రమం చేపట్టారు. ఈ నేపథ్యంలో ఇవాళ రైతు సంఘాల నాయకులతో కేంద్రం నాలుగోసారి చర్చలు జరుపనుంది. కేంద్ర మంత్రులు అర్జున్ ముండా, పీయూష్ గోయల్, నిత్యానందరాయ్‌లు ఛండీగడ్‌లో రైతులతో భేటీ కానున్నారు.
మరోవైపు.. రైతుల ఆందోళనల నేపథ్యంలో హర్యానాలో ఇంటర్నెట్ సేవలపై నిషేధాన్ని ఫిబ్రవరి 19 వరకు పొడిగించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకుండా భద్రతను కట్టుదిట్టం చేశారు పోలీసులు. అయితే ఇప్పటి కేంద్రం రైతు సంఘాలతో జరిపిన చర్చలు అసంపూర్తిగా ముగిశాయి. పంటల కనీస మద్దతు ధరకు చట్టపరమైన హామీ, స్వామినాథన్ సిఫార్సుల అమలు, రైతు కూలీలకు పింఛను, వ్యవసాయ రుణాల మాఫీ వంటివి రైతుల ప్రధాన డిమాండ్లలో ఉన్నాయి. ఇదిలా ఉండగా..రైతుల ఉద్యమాన్ని సోషల్ మీడియాలో ప్రసారం చేస్తున్న 70 యూట్యూబ్ చానళ్లపై కేంద్రం నిషేధం విధించింది. ఆందోళనకారులు రాళ్లు రువ్వుతూ భద్రతా దళాలను కవ్విస్తున్నారంటూ పోలీసులు వీడియోలను విడుదల చేశారు.