దేశ రాజధాని ఢిల్లీలోని ఓ చర్చిలో దుండగులు విధ్వంసం సృష్టించారు. ప్రార్థన సమయంలో ఓ వర్గానిని చెందిన గ్యాంగ్ ప్రవేశించి మందిరాన్ని ధ్వంసం చేసింది. నినాదాలు చేస్తూ గందరగోళం సృష్టించారు. అక్కడున్నవారిపై దాడి చేశారు. ఈ దాడిలో ఒకరికి స్వల్ప గాయాలయ్యాయి. తహీర్పూర్ ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది.
దుండగులపై జీటీబీ ఎన్‌క్లేవ్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేస్తున్న సమయంలోనూ కొందరు నినాదాలు చేశారు. ఈ ఘటనకు సంబంధించి కేసు నమోదు చేసిన పోలీసులు ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు.చర్చి సమీపంలో సీసీటీవీ దృశ్యాలను పరిశీలించి మిగతా నిందితులను గుర్తించేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. ముందుజాగ్రత్త చర్యగా చర్చి పరిసర ప్రాంతాల్లో పెద్దసంఖ్యలో పోలీసులను మోహరించారు.