ఒక్క ఛాన్స్ ఇవ్వండి.. కాంగ్రెస్ను మర్చిపోతారు - అరవింద్ కేజ్రీవాల్

Update: 2023-08-20 16:46 GMT

ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కాంగ్రెస్ ను టార్గెట్ చేశారు. ఇండియా కూటమిలో భాగస్వామిగా ఉంటూనే అందులో భాగమైన కాంగ్రెస్పై విమర్శలు గుప్పించారు. మధ్యప్రదేశ్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఆయన రాష్ట్రంలో తమకు అవకాశమిస్తే బీజేపీనే కాదు కాంగ్రెస్ పార్టీని సైతం మర్చిపోతారని అన్నారు.

సాట్నాలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న అరవింద్ కేజ్రీవాల్ ఎన్నికల ప్రస్తావన తీసుకొచ్చారు. ఆమ్ ఆద్మీ పార్టీ అధికారంలో ఉన్న ఢిల్లీ, పంజాబ్ రాష్ట్రాల్లో తమను మరో 50 ఏళ్ల వరకు ఏ పార్టీ ఏం చేయలేదని కేజ్రీవాల్ ధీమా వ్యక్తంచేశారు. మధ్యప్రదేశ్‌లో కూడా ఒకసారి అవకాశమిస్తే కాంగ్రెస్, బీజేపీల కన్నా గొప్ప పాలన అందిస్తామని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ బీజేపీని, బీజేపీ పార్టీ కాంగ్రెస్ ను విమర్శిస్తాయన్న ఆయన.. తమకు విమర్శించడం తెలియదని, జాతిని నిర్మించడమే తమ ప్రధాన లక్ష్యమని చెప్పారు. అందుకోసమే అన్నాహజారే ఆందోళన నుండి విడిపోయామని కేజ్రీవాల్ స్పష్టంచేశారు.

ఇన్‌కం టాక్స్‌ కమీషనర్‍గా ఉన్న తాను ప్రజా సేవ చేయాలన్న లక్ష్యంతో ఉద్యోగాన్ని విడిచిపెట్టేశానని కేజ్రీవాల్ చెప్పారు. తాము రాజకీయ నాయకులం కాదు. జాతి నిర్మాణమే మా ప్రధాన ఎజెండా అని మధ్యప్రదేశ్‌లో ఆప్ను గెలిపిస్తే బీజేపీనే కాదు కాంగ్రెస్ పార్టీని కూడా మర్చిపోయేలా పరిపాలిస్తామని చెప్పారు.



Tags:    

Similar News