40 ఏళ్ల తర్వాత ఫ్రీడమ్ ఫైటర్‌కు పెన్షన్.. కేంద్రంపై హైకోర్టు సీరియస్
వడ్డీతో సహా 12 వారాల్లో ఇవ్వాలి..
దేశ స్వాతంత్ర్య పోరాటంలో తన వంతు పోరాడిన ఓ స్వాతంత్ర్య సమరయోధుడిపై కేంద్రం చిన్నచూపు చూసింది. బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా అనేక ఉద్యమాలు చేసిన ఆ యోధుడికి ఇవ్వాల్సిన పెన్షన్ విషయంలో అలసత్వం ప్రదర్శించింది. ఫలితంగా అతను ఇన్నాళ్లుగా పెన్షన్ అందుకోలేకపోయాడు. తాజాగా ఈ కేసుకి సంబంధించి ఢిల్లీ హైకోర్టులో విచారణ జరగ్గా.. బాధితుడైన ఉతిమ్ లాల్ సింగ్‌కు పెన్షన్ ఇవ్వకుండా కేంద్రం అవమానించిందని ఆగ్రహం వ్యక్తం చేసింది న్యాయస్థానం.
బిహార్‌కు చెందిన ఉతిమ్ లాల్ సింగ్(96).. ఆనాడు స్వాతంత్ర్య ఉద్యమంలో చురుకుగా పాల్గొన్న వ్యక్తి. బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా అనేక ఉద్యమాలు చేశారాయన. ఈ క్రమంలోనే బ్రిటిష్ ప్రభుత్వం ఆయనపై అనేక కేసులు పెట్టింది. వీటిపై విచారణ చేసి అతడి భూమిని జప్తు చేసింది. అయితే, దేశ స్వాతంత్ర్య సంగ్రామంలో పాల్గొన్న వారికి కేంద్ర ప్రభుత్వం స్వతంత్ర సైనిక్ సమ్మాన్ పెన్షన్‌ను ఇస్తుంది. కానీ ఇప్పటివరకూ ఉతిమ్ లాల్ పెన్షన్ ఇవ్వలేదు. దీంతో ఈ కేసును బిహార్ ప్రభుత్వం.. ఢిల్లీ హైకోర్టుకు ప్రతిపాదించింది. ఈ పిటిషన్ విచారించిన హైకోర్టు.. ఉతిమ్ లాల్ సింగ్‌కు పెన్షన్ ఇవ్వకపోవడంపై అసహనం వ్యక్తం చేసింది. ఆయనకు పెన్షన్ ఇవ్వాలని జిల్లా మెజిస్ట్రేట్ ధ్రువీకరించినా.. ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించింది. ఇది పెన్షన్ స్ఫూర్తికి పూర్తిగా విరుద్ధమైందని వ్యాఖ్యానించింది. కేంద్ర ప్రభుత్వం ఇలా ప్రవర్తించడం చాలా బాధాకమని పేర్కొంది.
ఇప్పటివరకూ అతడి పొందలేని పెన్షన్ ను.. ఏడాదికి 6 శాతం వడ్డీ చొప్పున 1980 ఆగస్టు 1 నుంచి ఉన్న బకాయిలను చెల్లించాలని ఆదేశించింది. వీటిని 12 వారాల్లోగా బాధితుడికి ఇచ్చేయాలని చెప్పింది. దీంతో పాటు పెన్షన్ ఇవ్వకుండా అలసత్వం వహించిన కేంద్రానికి రూ.20వేలు జరిమానా విధించారు జస్టిస్ సుబ్రమణ్యం ప్రసాద్.