Delhi High Court:సంపాదించే సత్తా ఉండి కూడా మనోవర్తికై ఎదురుచూపులా?: ఢిల్లీ హైకోర్టు

Byline :  Veerendra Prasad
Update: 2023-11-23 02:57 GMT

విడిపోయిన భార్యభర్తల నెలవారీ భరణాని(మనోవర్తి)కి సంబంధించిన కేసును విచారిస్తూ ఢిల్లీ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. పని చేసి సంపాదించుకునే సత్తా ఉండి కూడా ఏ పనీ చేయకుండా ఖాళీగా కూర్చునే భార్య లేదా భర్త... తన జీవిత భాగస్వామిపై భరణం పేరిట భారం మోపడాన్ని అనుమతించరాదని కీలక తీర్పు చెప్పింది .హిందూ వివాహ చట్టం(హెచ్ఎంఏ) కింద విడిపోయిన భార్యకు భర్త చెల్లించాల్సిన నెలవారీ భరణాన్ని రూ.30,000 నుంచి 21,000లకి తగ్గిస్తూ హైకోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. వివాహచట్టంలోని 24, 25 సెక్షన్లు మనోవర్తి విషయంలో లింగ భేదాన్ని పాటించవనీ, అవి స్త్రీ పురుషులు ఇద్దరికీ సమానంగా వర్తిస్తాయని గుర్తు చేసింది.

ఇదీ కేసు..

2018లో పెళ్లైన ఓ జంట కాపురంలో కలహాల రేగాయి. దీంతో 2020 జులైలో భార్య పుట్టింటికి వెళ్లిపోగా.. ఆమెకు భరణం కింద నెలకు రూ.21,000 మనోవర్తి చెల్లించాలని ఫ్యామిలీ కోర్టు తీర్పు చెప్పింది. ఆ తర్వాత కారణం చెప్పకుండా ఆ మొత్తాన్ని రూ. 30,000కు పెంచింది. వాటితోపాటు ఆమె కోర్టు ఖర్చులు రూ.51,000 కూడా భర్తే చెల్లించాలని ఆదేశించింది సదరు కోర్టు. అయితే తాను చేస్తున్న ఉద్యోగంలో కటింగ్స్ పోగా నెలకు వచ్చే జీతం రూ. 47,000 మాత్రమేననీ, దానిలో రూ.30,000 విడిపోయిన భార్యకు చెల్లిస్తే, మిగతా 17 వేలతో ఇతర కుటుంబసభ్యులను పోషించలేనంటూ భర్త ఢిల్లీ హైకోరును ఆశ్రయించాడు. తన భార్య ఒక ఆస్పత్రిలో పనిచేస్తూ నెలకు రూ.25,000 సంపాదిస్తోందని కూడా తెలిపాడు.

జీతం లేని పని ఎందుకు?

హైకోర్టులో ఇరువాదనలు విన్న న్యాయమూర్తులు వీ కామేశ్వర్ రావు, అనూప్ కుమార్ మెండిరట్టలతో కూడిన ధర్మాసనం.. భార్యను ఆస్పత్రి ఉద్యోగం గురించి ప్రశ్నించింది. అందుకు సమాధానంగా.. తాను ఆస్పత్రి నుంచి జీతం తీసుకోకుండా సోషల్ సర్వీస్ చేస్తున్నానని చెప్పుకొచ్చింది. ఢిల్లీ యూనివర్సిటీలో గ్రాడ్యుయేషన్ చదివి, జీతం వచ్చే ఉద్యోగం చేసే అవకాశం ఉండి కూడా దాన్ని వదలి స్వచ్ఛందంగా పారితోషికం లభించని పని చేయడాన్ని హైకోర్టు ప్రశ్నించింది. సంపాదించే అవకాశం ఉండి కూడా ఉద్యోగం వెతుక్కోకుండా ఖాళీగా కూర్చొని తన ఖర్చులన్నీ విడిపోయిన భర్త మీద మోపడం సరికాదని పేర్కొంది.




Tags:    

Similar News