Arvind Kejriwal : బీజేపీ ఆదేశాల మేరకే ఈడీ నోటీసులు.. కేజ్రీవాల్
మద్యం కుంభకోణం కేసులో బీజేపీ ఆదేశాల మేరకే ఈడీ తనకు నోటీసులు పంపిందని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఆరోపించారు. ఈడీ పంపిన నోటీసులు చట్ట విరుద్ధమని అన్నారు. ఈ కేసులో ఈడీ విచారణకు తాను హాజరుకావడం లేదని కేజ్రీవాల్ తెలిపారు. త్వరలో నాలుగు రాష్ట్రాల్లో జరగనున్న ఎన్నికల ప్రచారానికి తనను వెళ్లకుండా అడ్డుకునేందుకే నోటీసు వచ్చిందని పేర్కొన్నారు. తనకు జారీ చేసిన సమన్లు వాపస్ తీసుకోవాలని ఈడీకి లేఖ రాశారు. అవి పూర్తిగా రాజకీయ కక్షతో చట్టవిరుద్ధంగా జారీ చేసిన నోటీసులుగా కేజ్రీవాల్ అభివర్ణించారు. కాగా, షెడ్యూల్ ప్రకారం నవంబర్ 2న ఉదయం 11 గంటలకు ఈడీ కార్యాలయంలో విచారణకు ఢిల్లీ సీఎం హాజరుకావాల్సి ఉంది.
ఈ క్రమంలో ఆయనకు సమన్లు జారీచేయడాన్ని వ్యతిరేకిస్తూ ఈడీ కార్యాలయం ఆప్ కార్యకర్తలు నిరసన ప్రదర్శన చేపట్టకుండా భారీగా భద్రతా ఏర్పాట్లు చేశారు. తుగ్లక్ రోడ్డులోని ఈడీ ఆఫీసు వద్ద పలు వరుసల్లో బారీకేడ్లను ఉంచి.. భారీ సంఖ్యలో పోలీసులు, పారా మిలిటరీ బలగాలను మోహరించినట్లు అధికారులు వెల్లడించారు. అలాగే దీన్ దయాళ్ ఉపాధ్యాయ్ మార్గ్‌లోని బీజేపీ కేంద్రం కార్యాలయం, ఐటీఓ ప్రాంతంలోని ఆప్ కార్యాలయం వద్ద భద్రతను కట్టుదిట్టం చేశారు. దాంతో ఇండియా గేట్, వికాస్ మార్గ్, ఐటీఓ ప్రాంతంలో వాహనాల రాకపోకలకు అంతరాయం కలుగుతోంది. కేజ్రీవాల్.. రాజ్‌ఘాట్ వద్ద నివాళి అర్పించేందుకు వెళ్లే అవకాశం ఉన్నట్లు తెలియడం వల్ల అక్కడ కూడా పోలీసులు భద్రతను పెంచారు. ఢిల్లీ నూతన మద్యం విధానంలో రూ.338 కోట్ల మేర అక్రమాలకు పాల్పడ్డారనేది ఈడీ ప్రధాన వాదన. ఢిల్లీ మద్యం విధానం 2021-22ని రూపొందించే క్రమం, అమలు సమయంలో ముఖ్యమంత్రిగా, ఆప్ అధినేతగా కేజ్రీవాల్‌ను నిందితులు సంప్రదించారని ఈడీ తన ఛార్జిషీటులో పేర్కొంది.
కేజ్రీవాల్‌కు ఈడీ సమన్లు జారీచేయడంపై బీజేపీ నేత హరీశ్ ఖురానా స్పందించారు. "చట్టం తన పని తాను చేసుకుపోతోంది. చట్ట ప్రకారమే కేజ్రీవాల్‌కు ఈడీ సమన్లు జారీ చేసింది. మనీశ్ సిసోదియా బెయిల్ విచారణ జరిగిన సమయంలో రూ.338 కోట్ల నగదు బదిలీ జరిగినట్లు ఈడీ ఆధారాలు చూపిందని సుప్రీంకోర్టు చెప్పింది. ఇప్పుడు కేజ్రీవాల్ అందుకు సమాధానం చెప్పాలి. 5 శాతం నుంచి 12 శాతానికి ఎక్సైజ్ సుంకాన్ని ఎందుకు పెంచారో చెప్పాలి. స్కామ్ లేకపోతే సిసోదియా బెయిల్ పిటిషన్ ఆరుసార్లు ఎందుకు తిరస్కరణకు గురవుతుంది? స్కామ్ ప్రధాన సూత్రధారి అరవింద్ కేజ్రీవాల్" అని హరీశ్ ఖురానా ఆరోపించారు.