మీ ఆరోపణలకు ఆధారాలున్నాయా..? రెజ్లర్లను కోరిన పోలీసులు

Update: 2023-06-11 08:54 GMT

బీజేపీ ఎంపీ, WFI చీఫ్ బ్రిజ్‌ భూషణ్‌ శరణ్‌ సింగ్‌.. తమను లైంగికంగా వేధించారంటూ మహిళా రెజర్లు చేసిన ఆరోపణలపై ఢిల్లీ పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. దర్యాప్తులో భాగంగా బ్రిజ్‌భూషణ్‌ మిమ్మల్ని తాకరాని చోట తాకినట్లుగా ఫొటో, వీడియో లేదా ఆడియో ఆధారాలు ఉంటే ఇవ్వాలని.. బాధితులైన ఇద్దరు మహిళా రెజ్లర్లను పోలీసులు కోరారు. ఈ విషయాన్ని ఓ జాతీయ పత్రిక వెల్లడించింది.

బ్రిజ్‌భూషణ్‌ తమను 2016 నుంచి 2019 మధ్య లైంగికంగా వేధించాడని ఈ ఏడాది ఏప్రిల్‌ 28న ఇద్దరు మహిళా రెజ్లర్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు. శ్వాసను పరీక్షించే నెపంతో ఆయన తమ ఛాతిపై చేతులు వేసేవాడని, అక్కడి నుంచి చేతులను కిందకు జారుస్తూ పొట్టపై నొక్కేవాడని వారు తమ ఫిర్యాదులో పేర్కొన్నారు. ఫిర్యాదు స్వీకరించిన పోలీసులు నిందితుడిపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయకుండా... అతనిపై ఆరోపణలకు బలం చేకూర్చే ఆధారాలుంటే సమర్పించాలని రెజ్లర్లను కోరారు.ఢిల్లీ పోలీసులు రెజ్లర్లకు సీఆర్‌పీసీ 91 నోటీసులు అందజేసినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. అందులో భాగంగా ఫిర్యాదుకు సంబంధించి ఎలాంటి ఆధారాలున్నా తమకు అందజేయాలని ఆరోపణలు చేసిన రెజ్లర్లను కోరారు.

ఇదిలా ఉండగా బ్రిజ్‌ భూషణ్‌ శరణ్‌ సింగ్‌ తన సొంత రాష్ట్రం ఉత్తర్‌ప్రదేశ్‌లోని గోండాలో ఇవాళ భారీ ర్యాలీ నిర్వహిస్తున్నాడు. లైంగిక ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎంపీని తక్షణమే బీజేపజీ నుంచి బహిష్కరించాలని ప్రతిపక్షాలు డిమాండ్‌ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో తన బలం ఏంటో తెలియజేసేందుకే బ్రిజ్‌ భూషణ్‌ ఈ ర్యాలీ చేస్తున్నట్లు తెలుస్తోంది. బ్రిజ్‌ భూషణ్‌కు వ్యతిరేకంగా ఇటీవల భారత అగ్రశ్రేణి రెజర్లు దిల్లీలోని జంతర్‌మంతర్‌ వద్ద కొన్ని రోజుల పాటు దీక్ష (Wrestlers Protest) చేపట్టిన విషయం తెలిసిందే. వీరి ఆందోళన ఇటీవల ఉద్ధృతమవడంతో స్పందించిన కేంద్ర క్రీడల శాఖ మంత్రి అనురాగ్‌ ఠాకూర్‌.. వారితో చర్చలు జరిపారు. బ్రిజ్‌ భూషణ్‌పై ఈ నెల 15 లోపు ఛార్జ్‌షీట్‌ దాఖలు చేస్తామని, జూన్‌ 30 లోపు డబ్ల్యూఎఫ్‌ఐకి ఎన్నికలు నిర్వహిస్తామని కేంద్రం హామీ ఇవ్వడంతో.. రెజ్లర్లు తమ ఉద్యమానికి తాత్కాలికంగా విరామం ప్రకటించారు.

Tags:    

Similar News