ఢిల్లీలో వాయు కాలుష్యం ప్రమాదకర స్థాయికిచేరింది. గురువారం గాలి నాణ్యత మరింత అధ్వాన్నంగా మారింది. ఢిల్లీతో పాటు నోయిడా, గ్రేటర్ నోయిడా పరిస్థితి దారుణంగా మారింది. ఈ క్రమంలో గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్ మూడో విడత ఆంక్షలు విధించాలని ఎయిర్ క్వాలిటీ ప్యానెల్ ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ నేపథ్యంలో అనవసరమైన నిర్మాణాలు, కూల్చివేత పనులపై నిషేధాజ్ఞలు అమల్లోకి వచ్చాయి. ఢిల్లీ, గురుగ్రాం, ఫరీదాబాద్, ఘజియాబాద్, గౌతమ్ బుద్ధనగర్‌లో పెట్రోల్‌తో నడిచే బీఎస్-3 ఇంజిన్‌లు, డీజిల్‌తో నడిచే బీఎస్-4 వాహనాలను నడపడంపై బ్యాన్ విధించారు.
గాలి నాణ్యత దారుణంగా మారడంతో కేజ్రీవాల్ సర్కారు కీలక నిర్ణయం తీసుకుంది. నగరంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు ప్రైమరీ స్కూళ్లను రెండు రోజుల పాటు మూసివేస్తున్నట్లు ప్రకటించింది. ఈ విషయాన్ని సీఎం అరవింద్ కేజ్రీవాల్ సోషల్ మీడియాలో ప్రకటించారు. అయితే మున్సిపల్ కార్పొరేషన్ ఆఫ్ ఢిల్లీ పరిధిలోని స్కూళ్లలో 1 నుంచి 5వ తరగతి వరకు ఆన్ లైన్ క్లాసులు కొనసాగుతాయని విద్యాశాఖ అధికారులు స్పష్టం చేశారు. టీచర్లు, ఇతర సిబ్బంది మాత్రం స్కూల్ కు రావాల్సి ఉంటుందని స్పష్టం చేశారు.