Mamata Banerjee: బీడీ కార్మికులతో ఫోటో షూట్.. రాహుల్ గాంధీకి దీదీ పంచ్‌లు
తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి, పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ కాంగ్రెస్ పార్టీని ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేశారు. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్‌కు కనీసం 40 స్ధానాలు కూడా దక్కడం అనుమానమేనని అన్నారు. బెంగాల్‌లోని ముర్షిదాబాద్‌లో శుక్రవారం జరిగిన బహిరంగసభలో ఆమె మాట్లాడుతూ.. కాంగ్రెస్ 300 సీట్లలో 40 సీట్లు కూడా గెలుస్తుందో.. లేదో కూడా అనుమానమని, ఎందుకు అంత అహంకారం.? అని నిలదీశారు. గెలిచిన సీట్లలో ఓడిపోవడం కాంగ్రెస్ కు అలవాటేనన్నారు.
భారత్ జోడో న్యాయ్ యాత్రలో భాగంగా రాహుల్ గాంధీ బెంగాల్‌లో అడుగుపెట్టినా తనకు సమాచారం ఇవ్వలేదని, ప్రభుత్వ యంత్రాంగం నుంచి తనకు ఈ విషయం తెలిసిందని ఆమె వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ యూపీ, రాజస్ధాన్‌లో గెలిచే పరిస్ధితి లేదని, అలహాబాద్, వారణాసిలో గెలిచి మీ పార్టీ సత్తా చాటాలని ఆమె కాంగ్రెస్‌కు సవాల్ విసిరారు. రాహుల్ బీడీ కార్మికులతో ఫొటో దిగిన అంశాన్ని ప్రస్తావిస్తూ ఒక్కసారి కూడా టీ దుకాణానికి వెళ్లని వారు ఇప్పుడు బీడీ కార్మికులతో కూర్చొని ఫోటో షూట్ చేస్తున్నారని మమతా బెనర్జీ ఎద్దేవా చేశారు. మీకు దమ్ముంటే వారణాసిలో బీజేపీని ఓడించండని రాహుల్ కి సవాల్ విసిరారు. మీరు గతంలో గెలిచిన చోట్ల ఓడిపోతారు.’’ అని అన్నారు. ఉత్తర ప్రదేశ్‌లో ఒక్క స్థానం లేదు, రాజస్థాన్‌లో మీరు గెలవలేదు, వెళ్లి ఆ సీట్లు గెలవండి, మీకు ఎంత ధైర్యం ఉందో చూస్తాను, వారణాసి, అలహాబాద్‌లో గెలవాలని, మీకు ఎంత ధైర్యం ఉందో చూస్తాను అని ఆమె సవాల్ విసిరారు.
బీజేపీని గద్దె దించాలని, ప్రధాని నరేంద్రమోడీకి అధికారాన్ని దూరం చేయాలని ప్రతిపక్షాలు అన్నీ కలిసి ‘ఇండియా కూటమి’ని ఏర్పాటు చేశాయి. అయితే, ఇటీవల కాలంలో కూటమిలో విబేధాలు తారాస్థాయికి చేరినట్లు తెలుస్తోంది. ఇప్పటికే కూటమి ఏర్పాట్లలో ముఖ్య భూమిక పోషించిన బీహార్ సీఎం నితీష్ కుమార్ మరోసారి ఎన్డీయే కూటమితో జతకట్టారు. టీఎంసీ, ఆప్ పార్టీలు కాంగ్రెస్‌తో సీట్లను పంచుకోమని తెగేసి చెప్పాయి.కాంగ్రెస్‌తో పొత్తు విబేధాల తర్వాత ఆమె ఆ పార్టీపై మరింత ఘాటు వ్యాఖ్యలు చేస్తున్నారు.