అంబులెన్స్ డ్రైవర్ దొంగబుద్ధి.. మృతుడి ఇంటికే కన్నం

Byline :  Veerendra Prasad
Update: 2023-09-03 05:34 GMT

అనారోగ్యంతో చనిపోయిన వ్యక్తి మృతదేహాన్ని అతడి స్వగ్రామానికి తీసుకెళ్లిన అంబులెన్స్ డ్రైవర్.. తన కక్కుర్తి బుద్దిని బయటపెట్టాడు. తాళం వేసి ఉన్న మృతుడి ఇంట్లోకి చోరీకి ప్లాన్ వేశాడు. ​ డ్రైవర్​తోపాటు అతడి కుమారుడు చేసిన పనికి పోలీసులు ఒక్కసారిగా షాకయ్యారు. మృతుడి లక్షల విలువైన బంగారు ఆభరణాలు, నగదును దోచుకెళ్లాడు. అయితే అంత్యక్రియలు పూర్తైన తర్వాత.. అసలు విషయం బయటపడింది. మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. అసలేం జరిగిందంటే..

నాగ్‌పూర్ జిల్లా సకర్దార పీఎస్ పరిధిలో మధ్యప్రదేశ్‌‌లోని బైతుల్‌కు చెందిన కల్పనా ఘోడో కుటుంబం నివాసం ఉంటోంది. ఆమె ప్రభుత్వ ఆస్పత్రిలో నర్సుగా పనిచేస్తున్నారు. ఆమె భర్త అనారోగ్యంతో ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆగస్టు 20న చనిపోయాడు. దీంతో స్వగ్రామానికి మృతదేహం తీసుకెళ్లి అంత్యక్రియలు నిర్వహించాలని కుటుంబసభ్యులు నిర్ణయించారు. వీరంతా మృతదేహాన్ని అంబులెన్స్‌లో తీసుకుని బైతుల్‌కు బయలుదేరారు. ఇంటికి తాళం వేసి కుటుంబసభ్యులంతా బైతుల్ కు బయలుదేరడంతో.. ఇదే అదునుగా భావించిన అంబులెన్స్ డ్రైవర్‌ అశ్విజిత్ వాంఖేడే‌ చోరీకి పథకం వేశాడు. మృతుడి ఇంట్లో దొంగతనం చేయాలని తన కొడుకు రితేశ్ (19)‌కు ఫోన్ చేసి తెలిపాడు.

దీంతో డ్రైవర్​ కుమారుడు.. తన ఇద్దరు స్నేహితులతో కలిసి వెళ్లి.. బాధితుడి ఇంట్లో మొబైల్​, నగదుతోపాటు లక్షల విలువైన బంగారు అభరణాలను దోచుకెళ్లాడు. భర్త అంత్యక్రియలు పూర్తయ్యాక కల్పన తిరిగి తన ఇంటికి ఇటీవలే చేరుకుంది. తీరా ఇంటి లోపలకు వెళ్లగా సామాన్లు, వస్తువులు చిందరవందరగా పడి ఉన్నాయి. బీరువాలో చూడగా నగదు, ఆభరణాలు కనిపించలేదు. దొంగతనం జరిగిందని గ్రహించి.. వెంటనే స్థానిక పోలీస్ స్టేషన్​లో ఘటనపై ఫిర్యాదు చేసింది. దర్యాప్తులో ఆ ఇంటికి సమీపంగా సీసీటీవీ ఫుటేజ్‌లను పరిశీలించగా.. ముగ్గురు యువకులు బైక్ పై వచ్చిట్టు , మృతుడి ఇంట్లోకి వెళ్లినట్లు అందులో రికార్డయ్యింది. బైక్ రిజిస్ట్రేషన్ నెంబరు చిరునామాతో నిందితులను గుర్తించారు. బైక్ ఓనర్‌ను అదుపులోకి తీసుకుని విచారించడంతో అసలు నేరస్థులు పట్టుబడ్డారు. ఇమామ్‌వాడా ప్రాంతానికి చెందిన అంబులెన్స్ డ్రైవర్ అశ్విజిత్, అతడి కుమారుడు రితేశ్‌తో పాటు చోరికి సహకరించిన ఇద్దరు స్నేహితులను అరెస్టు చేశారు. తండ్రి చెప్పడంతోనే స్నేహితులతో కలిసి చోరీకి పాల్పడినట్టు పోలీసులకు తెలియజేశాడు. వారి వద్ద చోరీ సొత్తును స్వాధీనం చేసుకున్నారు.

Tags:    

Similar News