చక్కెర ధరలకు రెక్కలు..వర్షాలే కారణమా?

By :  Aruna
Update: 2023-09-13 08:11 GMT

మొన్నటికి మొన్న టమాటా ధరలు పట్టపగలే చుక్కలు చూపించాయి. నిన్న మార్కెట్లో పప్పుల రేట్లు భగ్గుమన్నాయి..ఇప్పుడిప్పుడే ఉల్లి కన్నీరుపెట్టించేందుకు రెడీ అవుతోంది...ఇవి చాలవన్నట్లు త్వరలో తీపిని పంచే చక్కెర ధరలు చేదెక్కే సూచనలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. పొరుగు రాష్ట్రమైన మహారాష్ట్రలో కరవు నేపథ్యంలో చక్కెర దిగుబడి పడిపోయింది. ఏకంగా నాలుగేళ్లల్లో కనిష్టానికి దిగుబడి పడిపోయినట్లు తాజా లెక్కలు చెబుతున్నాయి. దీంతో అతి త్వరలో చక్కెర ధరల మోత మోగడం ఖాయంగా కనిపిస్తోంది. ఈ ఏడు సీజన్‎లో 14 శాతం దిగుబడి పడిపోనుందని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. స‌ర‌ఫ‌రా తగ్గుముఖం ప‌డితే ఆహార ద్ర‌వ్యోల్బ‌ణం ఎగ‌బాకుతుంద‌నే ఆందోళ‌న సర్వత్రా వ్యక్తం అవుతోంది

షుగర్ ఎక్స్‎పోర్ట్‏లో కేంద్ర సర్కార్ కోత విధిస్తే కనుక ఇప్ప‌టికే 10ఏళ్ల గ‌రిష్ట స్ధాయిలో పెరిగిన అంత‌ర్జాతీయ‌ చ‌క్కెర రేట్లు మ‌రింత పెరిగే అవకాశం ఉంది. మ‌రోవైపు గ్లోబ‌ల్ లెవెల్‎లో చక్కెర రేట్లు ధ‌ర‌లు అధికమైతే బ‌ల‌రాంపూర్ చినీ, ద్వారికేష్ షుగ‌ర్‌, శ్రీ రేణుక షుగ‌ర్స్‌, దాల్మియా భార‌త్ షుగ‌ర్ వంటి సంస్థల లాభాలు మరింతగా పెరుగుతాయ‌ని, తద్వారా ఆయా కంపెనీలు రైతుల‌కు సమయంలో చెల్లింపులు జరుపుతారని అంచనా వేస్తున్నారు నిపుణులు.

దేశవ్యాప్తంగా చ‌క్కెర ఉత్ప‌త్తిలో మూడింట ఓ వంతు మ‌హారాష్ట్ర నుంచే జరుగుతోంది. ప్రస్తుతం రాష్ట్రంలో క‌రువు పరిస్థితుల నేపథ్యంలో చ‌క్కెర ధ‌ర‌ల‌పై పెను ప్ర‌భావం చూప‌నుంది. పంట సాగులో కీలక సమయాల్లో వర్షాలు లేకపోవడంతో దిగుబడి తగ్గిపోతుందని, దాదాపు అన్ని జిల్లాల్లోనూ ఇదే పరిస్థితి ఏర్పడే అవకాశం ఉందని వెస్టిండియన్ షుగర్ మిల్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ధాంబ్రే తెలిపారు. వ‌ర్షాభావానికి తోడు ఉష్ణోగ్ర‌త‌లు పెరుగుతుండటంతో చెర‌కు సాగుపై ప్ర‌తికూల ప్ర‌భావం చూపుతుందని, తద్వారా దిగుబ‌డులు భారీగా త‌గ్గుతుందని మ‌హారాష్ట్ర షుగ‌ర్ క‌మిష‌న‌ర్ చంద్ర‌కాంత్ పుల్కంద్‌వ‌ర్ తెలిపారు.

Tags:    

Similar News