బెంగళూరు చోర్‌బజార్‌లో డచ్ యూట్యూబర్‌పై దాడి

Update: 2023-06-12 13:37 GMT

బెంగళూరులో ఓ డచ్ యూట్యూబర్కు చేదు అనుభవం ఎదురైంది. చోర్ బజార్లో వీడియో తీస్తుండగా స్థానిక వ్యాపారి అతడితో దురుసుగా ప్రవర్తించాడు. దీంతో యూట్యూబర్ అక్కడి నుంచి తప్పించుకుని వెళ్లిపోయాడు. మార్చిలో ఈ ఘటన జరగ్గా.. సదరు యూట్యూబర్ తాజాగా ఈ వీడియోను తన ఛానెళ్లో అప్లోడ్ చేయడంతో వెలుగులోకి వచ్చింది. డచ్ యూట్యూబర్ పెడ్రో మోటా భారత్ లోని వివిధ ప్రదేశాల్లో పర్యటిస్తూ అక్కడి విశేషాలను తన ఛానెల్లో అప్లోడ్ చేస్తున్నాడు. ఈ క్రమంలో అతడు బెంగళూరు వెళ్లాడు.

చిక్‌పేట్‌లోని చోర్ బజార్ లో వీడియో తీస్తుండగా ఓ వ్యక్తి అతడిపై దాడి చేశాడు. వీడియో ఎందుకు తీస్తున్నావంటూ పెడ్రో చేయి పట్టుకుని లాగాడు. దీంతో పెడ్రో అతడి నుంచి తప్పించుకుని వెళ్లిపోయాడు. అటాక్ ఎట్ ది థీవ్స్ మార్కెట్ ఇన్ ఇండియా అనే పేరుతో ఈ దాడి వీడియోను పెడ్రో తన ఛానల్లో పోస్ట్ చేశాడు. ‘‘ చోర్ బజార్లో నేను వీడియో తీస్తున్న సమయంలో ఓ వ్యక్తి నా చేతిని పట్టుకుని తిప్పాడు. నేను తప్పించుకోవడానికి ప్రయత్నిస్తుండగా నాపై దాడి చేశాడు. దీంతో అక్కడి నుంచి ఎలాగోలా తప్పించుకున్నాను. తర్వాత స్థానికంగా ఉన్న గొప్ప భారతీయ ప్రజలను కలిశాను’’ అని ఆ వీడియోలో వివరించాడు.

ఈ విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనపై ఆరా తీశారు. దాడి చేసేందుకు ప్రయత్నించిన వ్యాపారిని నవాబ్‌ హయత్‌ షరీఫ్‌గా గుర్తించి.. అతడిపై కేసు నమోదు చేశారు. విదేశీ పర్యాటకులను భయపెట్టడం, దాడులకు పాల్పడటం లాంటివి చేస్తే ఉపేక్షించేది లేదని బెంగళూరు పోలీసులు హెచ్చరించారు. కాగా గతంలో మహారాష్ట్ర, రాజస్థాన్ లలో కూడా ఇలాంటి ఘటనలు చోటుచేసుకున్నాయి.



Full View





Tags:    

Similar News