నాలుగు రాష్ట్రాల్లో భూకంపం.. ఇండ్లలోంచి బయటకు పరుగులు పెట్టిన జనం..

By :  Kiran
Update: 2023-12-08 06:50 GMT

దేశంలోని నాలుగు రాష్ట్రాల్లో భూకంపం వచ్చింది. గుజరాత్, కర్నాటక, తమిళనాడు, మేఘాలయా రాష్ట్రాల్లో వరుస భూకంపాలు వచ్చాయి. శుక్రవారం ఉదయం 6.52 గంటలకు కర్నాటకలోని విజయపురాలో భూమి కంపించింది. దీని తీవ్రత 3.1గా నమోదైందని నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ సిస్మోలజీ చెప్పింది. ఆ తర్వాత 45 నిమిషాలకు తమిళనాడులోని చంగల్పట్టులో కూడా భూకంపం వచ్చింది. ఉదయం 7.39 గంటలకు 3.2 తీవ్రతతో ప్రకంపనలు నమోదయ్యాయి. భూమికి లోపల 10 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రాన్ని గుర్తించినట్లు అధికారులు గుర్తించారు.

మరోవైపు ఉదయం 8.46 గంటలకు మేఘాలయాలోని షిల్లాంగ్‌లో భూకంపం వచ్చింది. దాని తీవ్రత 3.8గా నమోదైంది. ఇక గుజరాత్‌ కచ్‌లో ఉదయం 9 గంటలకు భూమి కంపించింది. భూమికి 20 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం ఉందని అధికారులు చెప్పారు. భూకంపం కారణంగా జనం ఇండ్లలోంచి బయటకు వచ్చారు. నాలుగు రాష్ట్రాల్లో వచ్చిన భూకంపాల వల్ల జరిగిన నష్టానికి సంబంధించిన ఎలాంటి వివరాలు అందలేదు.




Tags:    

Similar News