ప్రియాంక గాంధీకి ఈడీ షాక్.. ఆ కేసులో ప్రమేయం ఉందంటూ ఛార్జ్షీట్..

Byline :  Krishna
Update: 2023-12-28 06:42 GMT

ప్రియాంక గాంధీకి ఈడీ షాకిచ్చింది. మనీ లాండరింగ్ కేసుకు సంబంధించిన ఛార్జ్షీట్లో ఆమె పేరును ప్రస్తావించింది. ఈ కేసుతో ప్రియాంకకు సంబంధం ఉందని ఆరోపించింది. హర్యానాలో 2006 - 2010 మధ్య 5 ఎకరాల భూమికి సంబంధించిన కేసులో ఈడీ ఈ ఆరోపణలు చేసింది.‘‘రాబర్ట్ వాద్రా, కుమార్తె ప్రియాంక గాంధీ వాద్రా ఢిల్లీకి చెందిన రియల్ ఎస్టేట్ ఏజెంట్ ద్వారా హర్యానాలో భూమిని కొనుగోలు చేశారు. రాబర్ట్ వాద్రా ఆ భూమిని వ్యాపారవేత్త తంపికి విక్రయించాడు. దీనికి సంబంధించి లావాదేవీలు విదేశాల నుంచి జరిగాయి’’ అని తెలిపింది.

రాబర్ట్ వాద్రా 2006లో ఫరీదాబాద్ ప్రాంతంలోని అమీపూర్ గ్రామంలో రియల్ ఎస్టేట్ ఏజెంట్ అయిన హెచ్ఎల్ పహ్వా ద్వారా 40 ఎకరాల భూమిని కొనుగోలు చేశారు. 2010లో అదే భూమిని తిరిగి అతడికే అమ్మేశారు. అదే విధంగా 2006లో అదే గ్రామంలో పహ్వా ద్వారా.. ప్రియాంక గాంధీ 5 ఎకరాల భూమిని కొనుగోలు చేశారు. 2010లో అదే భూమిని తిరిగి పహ్వాకు అమ్మారు. ఈ భూముల కొనుగోలు సమయంలో జరిగిన ఆర్థిక లావాదేవీలు అన్నీ విదేశాల నుంచి అక్రమంగా జరిగాయనేది ఈడీ ఆరోపణ.

విదేశాలకు చెందిన థంపి, సుమిత్ చద్దా ద్వారా ప్రియాంక గాంధీ, ఆమె భర్త వాద్రా భూముల కొనుగోలు ద్వారా మనీలాండరింగ్ పాల్పడ్డారని ఈడీ ఆరోపిస్తోంది. ఎన్ఆర్ఐ సీపీ తంపీ, బ్రిటన్ జాతీయుడు సుమిత్ చద్దాపై నమోదైన మనీలాండరింగ్ కేసు విచారణలో భాగంగా ఈడీ ఛార్జ్ సీట్ దాఖలు చేసింది. ఈ కేసులో గతంలో తంపికి సన్నిహితుడుగా రాబర్ట్ వాద్రాను పేర్కొన్న ఈడీ.. ఈ సారి ప్రియాంక గాంధీ పేరును సైతం ప్రస్తావించింది. 

Tags:    

Similar News