Arvind kejriwal : కేజ్రీవాల్‌కు ఏడో సారి ఈడీ నోటిసులు

Byline :  Vamshi
Update: 2024-02-22 06:13 GMT

ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు ఈడీ మరోసారి నోటీసులు జారీ చేసింది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసుకు సంబంధించిన ఆయనకు ఏడోసారి సమన్లు పంపింది. ఈ నెల 26న ఈడీ కార్యాలయంలో విచారణకు హాజరు కావాలని ఆదేశించింది. కాగా గతంలో కేజ్రీవాల్‌‌కు ఈడీ ఆరు సార్లు నోటీసులు జారీ చేసింది. కానీ ఆయన ఒక్కసారి కూడా విచారణకు హాజరు కాలేదు. ఈడీ నోటీసులు అక్రమం, చట్ట విరుద్దమని ఆయన వాదిస్తున్నారు. ఢిల్లీ లిక్కర్ స్కాంలో అనేకమందిని ఇప్పటికే ఈడీ అరెస్ట్ చేసింది. ఈ కేసులో కేజ్రీవాల్‌పై కూడా అనేక ఆరోపణలు రావడంతో.. ఆయనకు నవంబర్ 1వ తేదీన తొలిసారి ఈడీ నోటీసులు ఇచ్చింది. ఆ తర్వాత డిసెంబర్ 21న మళ్లీ సమన్లు జారీ చేసింది.

అయినా కేజ్రీవాల్ విచారణకు రాకపోవడంతో ఈ ఏడాది జనవరి 3, జనవరి 18న, ఫిబ్రవరి 2న నోటీసులు జారీ చేసింది. ఎన్నిసార్లు నోటీసులు జారీ చేసినా కేజ్రీవాల్ పట్టించుకోవడం లేదు. కాగా లిక్కర్ స్కాంలో తన పాత్ర లేదని, రాజకీయ కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే తనను ఇరికిస్తున్నారని కేజ్రీవాల్ కామెంట్ చేశారు. తాను తప్పు చేసినట్లు ఆధారాలు ఉంటే ఈడీ అరెస్ట్ చేసుకోవచ్చని, తాను భయపడే ప్రసక్తే లేదని తేల్చిచెప్పారు. చట్టాన్ని తాను గౌరవిస్తానంటూ కేజ్రీవాల్ చెప్పుకొచ్చారు. లోక్‌సభ ఎన్నికలు వస్తున్న క్రమంలో కేజ్రీవాల్‌కు ఈడీ నుంచి నోటీసులు వస్తుండటంపై ఆప్ వర్గాలు మండిపడుతున్నాయి. పార్లమెంట్ ఎన్నికల్లో ప్రచారం చేయనీయకుండా చేసేందుకు ఇలా పదే పదే నోటీసులు ఇస్తున్నారని ఆరోపిస్తున్నారు. కేజ్రీవాల్‌ను చట్టవిరుద్దంగా అరెస్ట్ చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆప్ వర్గాలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి.

Tags:    

Similar News