Arvind Kejriwal : ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ అనుచరుల ఇళ్లలో ఈడీ సోదాలు
(Arvind Kejriwal) ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ అనుచరుల ఇళ్లల్లో ఈడీ సోదాలు చేపట్టింది. మనీలాండరింగ్ కేసులో కేజ్రీవాల్ సెక్రటరీ బిభవ్ కుమార్, ఎంపీ ఎన్డీ గుప్తా సహా మరికొంతమంది ఇళ్లల్లో ఈడీ తనిఖీలు చేస్తోంది. సుమారు 12 ప్రాంతాల్లో తనిఖీలు చేపట్టినట్టు సమాచారం. ఢిల్లీ జల్ బోర్డు అవినీతి కేసులో భాగంగా ఈడీ ఈ దాడులు నిర్వహించినట్లు తెలుస్తోంది. జల్ బోర్డు టెండర్ ప్రక్రియల్లో అవకతవకలు జరిగినట్లు సీబీఐ సహా ఏసీబీ ఎఫ్ఐఆర్ నమోదు చేశాయి. ఈ ఎఫ్ఐఆర్ ఆధారంగా మనీలాండరింగ్ జరిగినట్లు గుర్తించిన ఈడీ రంగంలోకి దిగింది.
ఇప్పటికే ఈ కేసులో డీజేబీ చీఫ్ ఇంజినీర్ జగదీష్ అరోరా, కాంట్రాక్టర్ అనిల్ అగర్వాల్లను ఈడీ అరెస్ట్ చేసింది. ప్రస్తుతం వారిని కస్టడీలోకి తీసుకుని విచారిస్తోంది. డీజేబీ అధికారులు విద్యుదయస్కాంత ప్రవాహ మీటర్ల సరఫరా, ఇన్‌స్టాలేషన్, టెస్టింగ్‌ల కోసం టెండర్లను ఆహ్వానించారు. అయితే అర్హతలు లేకున్నా ఒక సంస్థకు మాత్రమే వీటిని కట్టబెట్టారని వారిపై ఆరోపణలు వచ్చాయి. ఎన్‌కెజి ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్‌కు రూ.38 కోట్ల అక్రమంగా కట్టబెట్టారనే అభియోగాలున్నాయి.