లిక్కర్ స్కాం కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ దర్యాప్తు వేగవంతం చేసింది. కేసు విచారణలో భాగంగా ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్కు మరోసారి సమన్లు పంపింది. ఈ నెల 21 గురువారం రోజున విచారణకు రావాలని అందులో ఆదేశించింది. లిక్కర్ స్కాం కేసులో దర్యాప్తు సంస్థ అరవింద్ కేజ్రీవాల్ను విచారణకు పిలవడం ఇది రెండోసారి. అయితే గత నెలలో సమన్లు ఇచ్చినా ఆయన విచారణకు వెళ్లలేదు.
గతంలో ఈ ఏడాది నవంబర్ 2న ఈడీ ఆఫీసుకు రావాలని అధికారులు కేజ్రీవాల్కు నోటీసులు ఇచ్చారు. కానీ మధ్యప్రదేశ్ ఎన్నికల ప్రచారంలో ఉన్నా కేజ్రీవాల్ విచారణకు డుమ్మా కొట్టారు. తనకు చట్టవిరుద్దంగా సమన్లు పంపారని, వాటిని వెంటనే విత్ డ్రా చేసుకోవాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం కక్షపూరితంగా అరెస్టు చేస్తామని నిత్యం భయపెట్టే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. వారి బెదిరింపులకు, జైలుకు వెళ్లేందుకు భయపడే ప్రసక్తేలేదని అన్నారు.