ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ను అరెస్ట్ చేస్తారు - ఆప్ నేత
లిక్కర్ స్కాం కేసు విచారణలో భాగంగా ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ గురువారం ఈడీ ఎదుట హాజరుకానున్నారు. ఈ నేపథ్యంలో ఆ పార్టీకి చెందిన కీలక నేత చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు గురువారం కేజ్రీవాల్ను అరెస్ట్ చేస్తారని ఆప్ మంత్రి ఆతిషి చెప్పారు. లిక్కర్ స్కాం కేసులో ఆయనను ప్రశ్నించిన అనంతరం ఈడీ అధికారులు అదుపులోకి తీసుకుంటారని తమకు సమాచారం ఉందని అన్నారు. ఆతిషి చేసిన కామెంట్లు రాజకీయవర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి.
ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో మనీలాండరింగ్కు సంబంధించి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ విచారణ జరుపుతోంది. కేసు దర్యాప్తులో భాగంగా ఈడీ ఢిల్లీ సీఎం కేసీఆర్కు సమన్లు జారీ చేసింది. నవంబర్ 2న విచారణకు హాజరుకావాలని ఆదేశించింది. ఈ క్రమంలో మీడియాతో మాట్లాడిన ఆతిషి.. ఎన్నికల్లో తమను ఓడించలేమని గ్రహించిన బీజేపీ.. ఆప్ నేతలను లక్ష్యంగా చేసుకుందని ఆరోపించారు. ఈ నెల 2న కేజ్రీవాల్ అరెస్టు కాబోతున్నట్లు తమకు రిపోర్టు అందిందని చెప్పారు. ఒకవేళ కేజ్రీవాల్ అరెస్టైతే అది అవినీతి కేసులో కాదని, బీజేపీకి వ్యతిరేకంగా మాట్లాడినందుకేనని అన్నారు. ఢిల్లీ అసెంబ్లీ, మున్సిపల్ ఎలక్షన్లలో బీజేపీని ఆప్ రెండు సార్లు ఓడించిందని, అందుకే పార్టీ కీలక నేతలను తప్పుడు ఆరోపణలతో అరెస్ట్ చేస్తున్నారని ఆతిషి ఆరోపించారు.