Sharad Pawar : దేశంలో ఎన్నడూ ఇలాంటిది జరగలేదు: పవార్‌

Byline :  Veerendra Prasad
Update: 2024-02-12 01:21 GMT

కేంద్ర ఎన్నిక‌ల సంఘం (ఈసీ)పై నేష‌న‌లిస్ట్ కాంగ్రెస్ పార్టీ (NCP) వ్యవస్థాపకుడు శ‌ర‌ద్ ప‌వార్ సంచలన కామెంట్స్ చేశారు. ఎన్నికల సంఘమే NCPని తమనుంచి లాగేసుకుందని వాపోయారు. పార్టీని స్థాపించి, నిర్మించినవారి చేతుల్లోంచి (EC)లాక్కొని.. వేరేవాళ్లకు ఇవ్వడం దేశంలో గతంలో ఎన్నడూ జరగలేదని వ్యాఖ్యానించారు. ఆదివారం పుణేలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న శరద్ పవార్(Sharad Pawar).. అజిత్ ప‌వార్ సార‌ధ్యంలోని ఎన్సీపీ గ్రూప్‌కు ఎన్సీపీ పేరు, ఎన్నిక‌ల గుర్తును ఈసీ అప్ప‌గించ‌డం 'ఆశ్చ‌ర్యం' క‌లిగించింద‌న్నారు.

ఏ పార్టీకైనా కార్య‌క్ర‌మాలు, సిద్ధాంతాలు మాత్ర‌మే ముఖ్యమని చెప్పారు. పార్టీ గుర్తు కేవ‌లం కొంతకాలం మాత్రం ఉప‌యోగ‌పడుతుందని వ్యాఖ్యానించారు. 'ఈసీ నిర్ణయాన్ని ప్ర‌జ‌లు స‌మ‌ర్థించ‌ర‌ని నేను విశ్వ‌సిస్తున్నా. దీనిపై మేం సుప్రీంకోర్టును ఆశ్ర‌యించాం' అని చెప్పారు. మహారాష్ట్రలో ఇటీవల అజిత్‌ పవార్‌ వర్గాన్నే అసలైన ఎన్సీపీగా గుర్తించిన ఈసీ.. శరద్‌ పవార్‌ వర్గానికి ‘నేషనలిస్ట్‌ కాంగ్రెస్‌ పార్టీ- శరద్‌చంద్ర పవార్‌’(NCP-Sharadchandra Pawar) పేరును ఖరారు చేసిన విషయం తెలిసిందే.

1999లో అప్ప‌టి కాంగ్రెస్ పార్టీ అధ్య‌క్షురాలు సోనియాగాంధీ విదేశీయ‌త పేరుతో పార్టీ నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చిన శ‌ర‌ద్ ప‌వార్‌.. సొంతంగా నేష‌న‌లిస్ట్ కాంగ్రెస్ పార్టీ స్థాపించారు. 1999 లోక్‌స‌భ ఎన్నిక‌ల్లో విడిగా పోటీ చేసినా, మ‌హారాష్ట్ర‌లో కాంగ్రెస్ పార్టీతో క‌లిసి సంకీర్ణ ప్ర‌భుత్వం ఏర్పాటు చేశారు. 2004లో లోక్‌స‌భ ఎన్నిక‌ల్లోనూ కాంగ్రెస్ పార్టీతో క‌లిసి పోటీ చేశారు. నాటి ప్ర‌ధాని మ‌న్మోహ‌న్ సింగ్ సార‌ధ్యంలోని యూపీఏ స‌ర్కార్‌లో వ్య‌వ‌సాయ మంత్రిగా ప‌ని చేశారు.



 


 


 


 




Tags:    

Similar News