జులై 24న 10 రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్ సహా 10 మంది సభ్యుల పదవీకాలం పూర్తికానుంది. ఈ నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం ఈ మేరకు మంగళవారం షెడ్యూల్ ప్రకటించింది. ఈ ఏడాది జులై - ఆగస్ట్ మధ్య పశ్చిమ బెంగాల్, గోవా, గుజరాత్ నుంచి ఈ 10 స్థానాలు ఖాళీ కానున్నాయి.
పశ్చిమ బెంగాల్‌లో అత్యధికంగా 6 స్థానాలకు ఎన్నికలు జరగనుండగా గుజరాత్‌లో 3, గోవాలో ఒక స్థానం ఖాళీ కానుంది. ఆయా స్థానాలకు సంబంధించి ఎన్నికల నోటిఫికేషన్ జులై 6న విడుదలవుతుందని ఈసీ ప్రకటించింది. జూలై 13 వరకు నామినేషన్లు స్వీకరించనుండగా.. ఉపసంహరణకు జులై 17న చివరి తేదీగా ప్రకటించారు. 24న ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరగనుంది. అదే రోజు ఫలితాలను వెలువడనున్నాయి.
పశ్చిమ బెంగాల్‌లో డెరెక్ ఓబ్రియెన్, డోలా సేన్, ప్రదీప్ భట్టాచార్య, సుస్మితా దేవ్, శాంత ఛెత్రి, సుఖేందు శేఖర్ రాయ్, గుజరాత్ నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్న విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్, దినేష్ జెమల్‌భాయ్ అనవాదియా, లోఖండ్‌వాలా జుగల్ సింగ్ మాథుర్‌జీ, గోవా నుంచి ఎంపీ వినయ్ డీ టెండూల్కర్ పదవీకాలం కూడా ముగియనుంది.