బీజేపీ నేతలపై ఈటల రాజేందర్ సంచలన వ్యాఖ్యలు

Update: 2023-06-27 06:35 GMT

బీజేపీలో ఈటల రాజేందర్ వ్యవహారం చర్చనీయాంశంగా మారింది. ఆయన పార్టీ వీడుతారనే ప్రచారం జోరుగా జరుగుతోంది. ఈ క్రమంలోనే అధిష్టానం ఆయన్ను పిలిచి చర్చలు జరుపగా.. భేటీ తర్వాత కూడా ఈటల అసంతృప్తితోనే ఉన్నట్లు తెలుస్తోంది. ఈటలకు ప్రచార కమిటీ చైర్మన్ బాధ్యతలు ఇస్తారనే ప్రచారం జరిగినా ఇప్పటివరకు హైకమాండ్ ఎటువంటి ప్రకటన చేయలేదు. ఈ నేపథ్యంలో బీజేపీపై ఈటల సంచలన వ్యాఖ్యలు చేశారు.

తాను బీజేపీ నుంచి ఎప్పుడు వెళ్లిపోతానా అని తమ పార్టీలోని కొందరు నేతలు ఎదురుచూస్తున్నారని అన్నారు. అది వాళ్ల ఖర్మ అని.. దానికి తాను ఏం చేయలేనని చెప్పారు. ‘‘భగావో అని చెప్పేవాళ్లు ఉన్నారు.. అవమానించేవాళ్లు కూడా ఉన్నారు. వాళ్లెవరో ఇప్పటికే అందరికీ తెలుసు. కొందరు చిల్లగాళ్లు కోరుకున్నట్లుగా అంతా ఈజీగా నిర్ణయం తీసుకోను. బట్టలు మార్చినంత ఈజీగా పార్టీలు మారే వ్యక్తిని కాదు’’ ఈటల స్ఫష్టం చేశారు.

బీఆర్ఎస్ బయటకు పంపిస్తే బీజేపీ అక్కున చేర్చుకున్న విషయాన్ని ఈటల గుర్తుచేశారు. ఇక కేసీఆర్ను వదిలిపెట్టే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. కేసీఆర్ నియంతృత్వ పోకడతో వ్యవహరిస్తున్నారని.. రెండోసారి అధికారంలోకి వచ్చాక ఆయనకు అహంకారం పెరిగిందని విమర్శించారు. చిన్న రాష్ట్రాన్ని పాలించే సత్తా లేదు కానీ జాతీయ రాజకీయాలు అంటూ ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారని ఆరోపించారు.

ధరణితో లక్షల మంది రైతులు ఇబ్బందులు పడుతున్నారన్నారు. ధరణి వల్ల ఒక్క కేసీఆర్ కుటుంబానికి మాత్రమే లాభం జరిగిందని ఈటల అన్నారు. ప్రజలకు మంచి చేసే పథకాలను ఏ ప్రభుత్వాలు వచ్చినా ఎత్తివేయవని చెప్పారు. ప్రజలు ఒడగొట్టిన సైకో కౌశిక్ రెడ్డిని ఎమ్మెల్సీని చేశారని మండిపడ్డారు.   




Tags:    

Similar News