మార్చి 31 వరకు ఉల్లి ఎగుమతులపై నిషేధం పొడిగింపు

By :  Shabarish
Update: 2024-02-20 16:31 GMT

ఉల్లి ఎగుమతులపై కేంద్ర ప్రభుత్వం విధించిన నిషేధాన్ని పొడిగించింది. మార్చి 31వ తేది వరకూ ఉల్లి ఎగుమతుల నిషేధాన్ని పొడిగిస్తున్నట్లు ప్రకటించింది. దేశంలో ఉల్లి రేట్లు ఆకాశాన్ని అంటుతున్నాయి. దీంతో సామాన్యులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. ఈ క్రమంలో ఉల్లి ధరలను అదుపులో ఉంచాలని కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. 2024 మార్చి 31వ తేది వరకూ ఉల్లి ఎగుమతులపై నిషేధం విధించినట్లుగా వినియోగదారుల వ్యవహారాల కార్యదర్శి రోహిత్ కుమార్ సింగ్ తెలిపారు.

గత ఏడాది అక్టోబర్ నెలలో ఉల్లి ధరలు భారీగా పెరగడంతో అప్పుడు కూడా కేంద్రం ఉల్లి ఎగుమతులపై నిషేధం విధించిన సంగతి తెలిసిందే. దాంతో ధరలు కూడా దిగి వచ్చాయి. అప్పట్లో రిటైల్ మార్కెట్లోకి ఉల్లిపాయలను కిలోకు రూ.25 సబ్సిడీతో కేంద్రం విక్రయించింది. తాజాగా ఇప్పుడు కూడా ఉల్లి ధరలు పెరుగుతుండటంతో కేంద్రం ముందే నిర్ణయం తీసుకుంది. ఉల్లి ఎగుమతులపై నిషేధం విధిస్తూ కీలక ప్రకటన చేసింది.

ప్రస్తుతం దేశంలోనే అతిపెద్ద హోల్ సేల్ ఉల్లి మార్కెట్ అయిన లాసల్‌గాన్‌లో హోల్ సేల్ ఉల్లి ధర క్వింటాల్‌కు రూ.1,280 నుంచి పెరిగి రూ.1,800కు చేరుకుంది. సుమారు 40.62 శాతం పెరగడంతో ప్రజలు లబోదిబోమంటున్నారు. మరోవైపు రెండు నెలల్లో సాధారణ ఎన్నికలు కూడా ఉన్నాయి. ఈ తరుణంలో మార్చి 31వ తేది తర్వాత కూడా ఉల్లి ఎగుమతులపై నిషేధాన్ని ఎత్తివేసే అవకాశమే లేదు. ప్రస్తుతం వ్యవసాయ మంత్రిత్వ శాఖ అధికారులు మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, గుజరాత్ రాష్ట్రాలలో ఉల్లి ధరలను పరిశీలిస్తున్నారు. మరోవైైపు ఉల్లి ఎగుమతి నిషేధించడంతో రైతులు నష్టపోతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.


Tags:    

Similar News