Farmers Protest : రైతులతో కేంద్రం చర్చలు విఫలం..ఢిల్లీ చలో కొనసాగింపు
ఢిల్లీ రైతులతో కేంద్రం చేసిన చర్చలు విఫలమయ్యాయి. పప్పు ధాన్యాలు, మొక్కజొన్న, పత్తిని కేంద్రం కనీస మద్దతు ధరకు కొంటాయని, ఇందుకోసం ఐదేళ్లు ఒప్పందం కుదుర్చుకునేందుకు సిద్ధమని రైతులకు కేంద్రం ప్రతిపాదించింది. అయితే ఈ ప్రతిపాదనను రైతు సంఘం నేతలు తిరస్కరించారు. ఆదివారం అర్థరాత్రి వరకు కేంద్ర మంత్రులు అర్జున్ ముండా, పీయూష్ గోయల్, నిత్యానంద్ రాయ్..రైతులతో చర్చించారు. వారు తమ నిర్ణయాన్ని అందరితో మాట్లాడినంక చెబుతామని తెలిపారు. ఆ తర్వాత రైతులతో చర్చించిన అనంతరం కేంద్ర ప్రభుత్వ ప్రతిపాదనను తిరస్కరిస్తున్నట్లు ప్రకటించారు. కేంద్రం ప్రతిపాదనలు రైతుల ప్రయోజనాలకు అనుగుణంగా లేవని అందుకే వాటిని తిరస్కరిస్తున్నామని జగ్జీత్ సింగ్ దల్లేవాల్ తెలిపారు.
పంటలకు కనీస మద్దతు ధర, స్వామినాథన్ కమిటీ సిఫార్సుల అమలు, గతంలో చేపట్టిన ఆందోళనల్లో మృతి చెందిన రైతుల కుటుంబాలకు సాయం అందించడం సహా పలు డిమాండ్లను ఆమోదించాలని కోరుతూ రైతు సంఘాలు ఢిల్లీ చలోకు పిలుపునిచ్చాయి. ఈ క్రమంలో ట్రాక్టర్లు, ట్రాలీలతో ర్యాలీగా బయలుదేరిన రైతులను శంభు సరిహద్దుల్లో పోలీసులు అడ్డుకున్నారు. ఢిల్లీవైపు వెళ్లకుండా బారికేడ్లు, ఇనుప కంచెలు, కాంక్రీట్ దిమ్మెలను ఏర్పాటు చేశారు. అంతేగాక వారిపై టియర్ గ్యాస్ ను కూడా ప్రయోగించారు. కేంద్రం తమ డిమాండ్లను అంగీకరించాలని, లేదంటే శాంతియుతంగా ఢిల్లీ వరకూ ర్యాలీ చేపట్టేందుకు అనుమతించాలని రాజధాని సరిహద్దుల్లోనే ఉండిపోయారు రైతులు.
కేంద్రంతో చర్చలు విఫలమైన నేపథ్యంలో ఈ నెల 21న ఢిల్లీకి చేరుకుంటామని, శాంతియుతంగా ఆందోళన నిర్వహిస్తామని రైతు నేత శర్వాన్ సింగ్ పంథేర్ చెప్పారు. ఈ మేరకు తమ సమస్యలనైనా పరిష్కరించాలని, లేదంటే ఢిల్లీకి వెళ్లేందుకు వీలుగా బారికేడ్లను తొలగించాలని ఆయన డిమాండ్ చేశారు. మరోవైపు ఈ నెల 23న ఢిల్లీ మార్చ్ నిర్వహిస్తామని నొయిడా, గ్రేటర్ నొయిడా రైతులు తెలిపారు. భూసేకరణకు అధిక పరిహారం, అభివృద్ధి చేసిన ప్లాట్ల అప్పగింతపై ఈ మార్చ్ నిర్వహించనున్నామని చెప్పుకొచ్చారు.