అన్నదాతల ఆగ్రహం.. సెక్రటేరియట్ వద్ద ఉద్రిక్తత..

Byline :  Kiran
Update: 2023-08-29 13:16 GMT

మహారాష్ట్రలో రైతుల ఆందోళన ఉద్రిక్తంగా మారింది. తమ భూములకు సరైన పరిహారం చెల్లించాలంటూ రోడ్డెక్కిన అన్నదాతలు మంగళవారం భారీ ర్యాలీగా ముంబైకి చేరుకున్నారు. మంత్రాలయ భవనంలోకి చొచ్చుకెళ్లారు. బిల్డింగ్ ఫస్ట్ ఫ్లోర్లో రక్షణ కోసం ఏర్పాటు చేసిన వలపై దూకేశారు. అక్కడే నిరసన కొనసాగించారు. రైతులను అక్కడి నుంచి తరలించేందుకు పోలీసులు తీవ్రంగా శ్రమించారు. కొందరు ఆందోళనకారులను అదుపులోకి తీసుకున్న పోలీసులు వారిని మెరైన్ డ్రైవ్ పోలీస్ స్టేషన్కు తరలించినట్లు సమాచారం.




 


అన్నదాతల ఆందోళనలపై ఏక్నాథ్ షిండే ప్రభుత్వం స్పందించింది. నిరసన చేస్తున్న రైతులను చర్చలకు పిలిచింది. రాష్ట్ర మంత్రి దాదా భూసే అన్నదాతలతో సమావేశమై వారి డిమాండ్లపై చర్చించారు. అనంతరం మీడియాతో మాట్లాడిన సీఎం ఏక్నాథ్ షిండే 15 రోజుల్లోగా సమస్యలన్నింటినీ పరిష్కరిస్తామని హామీ ఇచ్చినట్లు చెప్పారు.




 


మహారాష్ట్రలోని పలు ప్రాంతాల్లో చేపట్టిన అభివృద్ధి పనుల కోసం ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాల్లో భూములు సేకరిస్తోంది. అయితే తమ భూములు తీసుకుంటున్న సర్కారు సరైన పరిహారం ఇవ్వడంలేదని రైతులు ఆరోపిస్తున్నారు. తమ డిమాండ్లను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోవడం లేదని అంటున్నారు. తమ సమస్యను దేశ ప్రజలందరి దృష్టికి తెచ్చేందుకే మంత్రాలయ బిల్డింగ్ లోని రక్షణ వలపై ఆందోళన నిర్వహించినట్లు రైతులు చెప్పారు.




Tags:    

Similar News