FARMERS PROTEST : రైతులతో పెట్టుకుంటే ఊరుకోం..అన్నదాతను ఆదరించలేరా?
కేంద్ర ప్రభుత్వం తీరుకు నిరసనగా మరోసారి రైతులు పాదయాత్ర చేపట్టనున్నారు . ఈ రోజు ఉదయం 11గంటలలోపు తమ సమస్యలను పరిష్కరించాలని డెడ్ లైన్ విధించారు. లేకుంటే ఆందోళనలు చేస్తామని రైతులు కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. మరోవైపు రైతుల పాదయాత్ర నేపథ్యంలో ఢిల్లీ సరిహద్దుల్లో పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు.
రైతుల పాదయాత్ర నేపథ్యంలో ఢిల్లీ పోలీసులతో పాటుగా మిగిలిన అన్ని జిల్లాల సరిహద్దుల్లో సుమారు 5 వేల మంది పోలీసులు, పారామిలటరీ బలగాలను మోహరించారు. అంబాలా, కురుక్షేత్ర, కర్నాల్, పానిపట్, GT రోడ్, సోనిపట్, ఢిల్లీలోని సరిహద్దుల్లో 40 లేయర్ బారికేడ్‌లను ఏర్పాటు చేశారు. మరోవైపు హర్యానా ప్రభుత్వం 7 జిల్లాల్లో ఇంటర్నెట్ సేవలను బంద్ చేసింది. ఫిబ్రవరి 21వ తేది వరకూ మొబైల్ ఇంటర్నెట్ సేవలు అందుబాటులో ఉండవు.
రైతుల ఉద్యమం గురించి చెబుతున్న 177 సోషల్ మీడియా ఖాతాలు, వెబ్ లింక్‌లను ప్రభుత్వం తాత్కాలికంగా రద్దు చేసింది. పంటలకు కనీస మద్దతు ధర, రుణమాఫీ సహా తమ డిమాండ్ల కోసం కేంద్రంపై రైతు సంఘాలు ఒత్తిడి తెస్తున్నాయి. మరోవైపు రైతులకు మద్దతుగా రాహుల్ గాంధీ నిలిచారు. రైతులకు హామీ ఇస్తే దేశ జీడీపీ పెరుగుతుందని, రైతుల కోసం ఖర్చు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ఎందుకు వెనకాడుతోందని ప్రశ్నించారు.