కుమార్తె చనిపోయింది. తల్లిదండ్రులు దహన సంస్కారాలు కూడా చేసేసారు. నెల రోజులు గడిచాయి. ఆ తల్లిదండ్రులు తీరని దుఖంలో ఇకా మునిగే ఉన్నారు. ఇంతలో వాళ్ళకి అనుకోని షాక్ తగిలింది. ఉన్నట్టుండి సడెన్ గా కూతురు కాల్ చేసింది. తాను బతికే ఉన్నానంటూ చెప్పింది. ఈ సంఘటన బీహార్ లోని పాట్నాలో జరిగింది.
పాట్నాలో నెలరోజుల క్రితం అన్షు అను యువతి కనిపించకుండా పోయింది. తల్లిదండ్రులు ఆమె కోసం చాలా వెతికారు. పోలీసులకు కంప్లైంట్ ఇచ్చారు. సోషల్ మీడియాలో కూడా పోస్ట్ లు పెట్టారు. నెల రోజుల తర్వాత వాళ్ళుంటున్న ప్రదేశానికి దగ్గర కాలువలో ఒక మృతదేహం లభ్యమైందింటూ పోలీసులు తీసుకువచ్చారు. అయితే దొరికిన శవం ముఖం సరిగ్గా కనిపంచలేదు. బాడీ మీద ఉన్న దుస్తులు ఆధారంగా శవం తమ కూతురు అన్షుదే అనుకున్నారు. పోలీసులకు చెప్పారు. బాడీని తీసుకువెళ్ళి అంత్యక్రియలు చేసేసారు తల్లిదండ్రులు. అంతా అయిపోయింది అనుకున్నారు. తీరని దుఖంలో మునిగిపోయారు.
సరిగ్గా అక్కడే ట్విస్ట్ ఇచ్చింది అన్షు తల్లిదండ్రులు తాను అనుకుని వేరే యువతికి దహనసంస్కారాలు చేసిన వార్త అన్షుకు తెలిసింది. అంతే వెంటనే ఆమె తన తల్లిదండ్రులకు వీడియో కాల్ చేసింది. తాను బతికే ఉన్నానంటూ షాక్ ఇచ్చింది. తాను ప్రేమించినవాడిని పెళ్ళి చేసుకోవడానికి ఇంటి నుంచి పారిపోయానని చెప్పింది. ఆమె నిజంగానే తన ప్రియుడిని పెళ్ళి చేసుకుని అత్తవారింట్లో ఉంది అని చెబుతున్నారు పాట్నా పోలీస్ ఆఫీసర్ సూరజ్ ప్రసాద్.
ఇదంతా సరే మరి తగులబెట్టిన మృతదేహం ఎవరిది అంటూ ఆరాలు తీయడం మొదలుపెట్టారు పోలీసులు. ఇప్పటి వరకూ ఆమె ఎవరన్నది తెలియకపోయినా...దానిని పరువు హత్యగా నిర్ధారించారు. తల్లిదండ్రులే యువతిని చంపి పారిపోయారని ప్రాథమిక విచారణలో తేల్చారు. పారిపోయిన వారి కోసం గాలింపు జరుపుతున్నారు.
పాట్నాలో అన్షు సంఘటన చర్చనీయాంశం అయింది. ఆమె బతికే ఉందన్న విషయం తల్లిదండ్రులను ఆనందంలో ముంచెత్తింది. అన్షు ఫోన్ చేయకపోయి ఉంటే ఈ విషయం ఎప్పటికీ బయటకు వచ్చేది కాదంటున్నారు స్థానికులు.