Women Constable: మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్య.. శరీరంపై గాయాలు.. ప్రేమ వ్యవహారం?
ఉత్తరప్రదేశ్‌లో దారుణ ఘటన చోటుచేసుకుంది. ఆత్మహత్య చేసుకుని చనిపోయిన ఓ మహిళా కానిస్టేబుల్ మృతదేహంపై 500పైగా గాయాల మరకలు కనిపించడం కలకలం రేపింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. కానిస్టేబుల్ ఆత్మహత్యకు దారితీసిన కారణాలు, ఆమె శరీరంపై ఆ గాయాలు ఎలా వచ్చాయన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. యూపీలోని ఉన్నావ్‌లో జరిగిందీ ఘటన.
వివరాల్లోకి వెళితే.. ఉన్నావ్‌లో పోలీస్ లైన్‌లోని హాస్టల్లో నివాసం ఉంటున్న మీను అనే మహిళా కానిస్టేబుల్.. గురువారం తన గదిలోని ఫ్యాన్‌కు ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడింది. వెంటనే గమనించిన అక్కడి సిబ్బంది ఆమెను ఆస్పత్రికి తీసుకెళ్తుండగా మార్గమధ్యలో ప్రాణాలు కోల్పోయింది. అనంతరం ఆమె మృతదేహానికి శవ పరీక్షలు నిర్వహించారు. ఆ రిపోర్ట్ లో మహిళా కానిస్టేబుల్ ఉరివేసుకుని చనిపోయిందని, మృతదేహాంపై 500కుపైగా గాయాల గుర్తులు ఉన్నట్లు వెల్లడైంది. అలీగఢ్‌కు చెందిన ఓ కానిస్టేబుల్‌తో మీను ప్రేమలో ఉన్నట్లు స్థానికులు చెప్పారు.
అతడు మీనును మోసం చేసి వేరే మహిళను పెళ్లి చేసుకున్నాడని.. బాధితురాలు ఎన్నిసార్లు ఫోన్‌చేసినా సమాధానం ఇవ్వలేదని తెలుస్తోంది. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన మీను.. తనను తాను గాయపరుచుకుని ఆత్మహత్య చేసుకుని ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు చేపట్టారు. విచారణలో ఎవరు తప్పు చేసినట్లు తేలినా వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. అయితే మృతురాలి కుటుంబ సభ్యులు ఈ ఘటనపై మాట్లాడటానికి ఇష్టపడలేదు.