Driverless Train : దేశంలో తొలిసారి డ్రైవర్ లేకుండా మెట్రో రైల్
సరికొత్త టెక్నాలజీతో దేశంలో నూతన ఆవిష్కరణలు ప్రారంభం అవుతున్నాయి. తాజాగా దేశంలోనే తొలిసారిగా డ్రైవర్ లేకుండా మెట్రో రైలు పరుగులు తీయనుంది. ఇండియన్ సిలికాన్ వ్యాలీ బెంగళూరులో ఈ రైళ్లు ప్రారంభం కానున్నాయి. అందుకోసం బెంగళూరు మెట్రో రైల్ కార్పొరేషన్ ఏర్పాట్లు చేస్తోంది. మొదటగా బెంగళూరులోని ఎల్లో లైన్‌లో 19 కిలోమీటర్ల మార్గంలో ఈ రైలు నడవనుంది. ఆరు కోచ్‌లతో కూడిన ఈ రైలు చైనా నుంచి బెంగళూరుకు రానుంది. జనవరి 20వ తేదిన ఆ డ్రైవర్ లెస్ మెట్రో ట్రైన్ చైనా నుంచి బయల్దేరింది.
చెన్నై పోర్టుకు డ్రైవర్ లెస్ మెట్రో రైలు ఫిబ్రవరి చివరినాటికి చేరుకోనుంది. అయిగతే ఈ రైలు 2023 సెప్టెంబర్ నెలలోనే చేరుకోవాల్సి ఉంది. మేకిన్ ఇండియాలో భాగంగా 75 శాతం స్థానిక ఉత్పత్తి అవసరాలను కనుగొనేందుకు కొన్ని ఇబ్బందులు ఎదురవ్వడం వల్ల కాస్త ఆలస్యం అయ్యింది. చైనాకు చెందిన సీఆర్ఆర్సీ కంపెనీ ఈ కోచ్‌ల తయారీ కోసం కోల్‌కతాకు చెందిన టిటాగర్ రైల్‌తో డీల్ కుదుర్చుకుంది. కోచ్‌లను కోల్‌కతాకు సమీపంలో ఉత్తర్‌పరాలోని టిటాగర్ సంస్థ తయారు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు.
డ్రైవర్ లెస్ మెట్రో రైల్ సిద్ధమైతే అది దక్షిణ బెంగళూరులోని ఎలక్ట్రానిక్స్ సిటీని, అలాగే ఇన్ఫోసిస్, బయోకాన్ వంటి అనేక కంపెనీలలోని ఉద్యోగులకు సేవలను అందించనుంది. ఎల్లో లైన్‌లో ఆ మెట్రో సేవలను పొందొచ్చు. ఈ రైలు బెంగళూరు చేరిన తర్వాత కొన్ని రోజుల పాటు ట్రైల్ రన్స్ చేపడుతారు. ఇందులో 21 కోచ్‌లు పర్పుల్, గ్రీన్ లైన్‌లలో అమర్చనున్నారు. అలాగే మిగిలిన 15 కోచ్‌లు ఎల్లో లైన్‌లో సేవలు అందించనున్నాయి. 2024 సెప్టెంబర్ నెలలోగా ఈ రైళ్లు పట్టాలెక్కనున్నాయి.