ఉత్తరాఖండ్‌లో వరద బీభత్సం..కొండచరియలు విరిగిపడి..
ఉత్తరాదిలో భారీ వర్షాలు బీభత్సాన్ని సృష్టిస్తున్నాయి. హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్‌లలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు ప్రజలు తల్లడిల్లుతున్నారు. కుంభవృష్టికి తోడు కొండచరియలు విరిగిపడటంతో ఇప్పటివరకు 60 మంది మృతిచెందినట్లు అధికారులు ప్రకటించారు. సిమ్లాలోని సమ్మర్ హిల్స్ ప్రాంతంలో ఇవాళ కొండచరియలు విరిగిపడిన ఘటనలో 21 డెడ్ బాడీస్‌ను అధికారులు శిథిలాల కింది నుంచి వెలికి తీశారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. రానున్న రెండు రోజుల్లోనూ హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్‌లలో భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉంది. దీంతో అప్రమత్తమైన భారత వాతావరణ శాఖ పలు ప్రాంతాల్లో రెడ్ అలర్ట్ జారీ చేసింది. ప్రజలు సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని సూచించింది.
భారీ వర్షాలకు తోడు వరదలు బీభత్సంతో కాంగ్రాలోని పాంగ్ డ్యామ్ సమీపంలోని లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. 800మందికి పైగా ప్రజలను వరద ప్రభావిత ప్రాంతాల నుంచి సురక్షిత ప్రాంతాలకు తరలించారు. డ్యామ్‌లోనూ నీటి మట్టం క్రమక్రమంగా పెరుగుతోంది. దీంతో అప్రమత్తమైన రాష్ట్ర సర్కార్ ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించడంతో పాటు విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించింది.
వర్షాలపై ముఖ్యమంత్రి సుఖ్వీందర్ సింగ్ మాట్లాడుతూ.." మూడు రోజులుగా రాష్ట్రంలో 157 శాతం అధికంగా వర్షాలు కురుస్తున్నాయి. వానల ప్రభావంతో 1200 రహదారులు దెబ్బతిన్నాయి. వాటిలో 400 రోడ్లను బాగు చేశాం. రాష్ట్రంలో170 కొండచరియలు విరిగిపడిన ఘటనలు నమోదు అయ్యాయి. 9,600 ఇళ్లు కుప్పకూలాయి. సిమ్లా, సోలన్, మండీ, హమీర్‌పుర్, కాంగ్రా జిల్లాల్లో భారీగా నష్టం వాటిల్లింది". అని సీఎం తెలిపారు.
ఉత్తరాఖండ్‌లోనూ భారీ వర్షాలు బెంబేలెత్తిస్తున్నాయి. చమోలీ జిల్లా జోషిమఠ్ సమీపంలోని హెలాంగ్‌లో మంగళవారం ఓ భారీ భవనం కుప్పకూలింది. ఈ ప్రమాదంలో ఒకరు చనిపోగా , ఐదుగురిని శిథిలాల నుండి సురక్షితంగా బయటకు తీసుకువచ్చారు. ప్రస్తుతం వరద ప్రభావిత ప్రాంతాల్లో రాష్ట్రవిపత్తు ప్రతిస్పందన దళం సహాయక చర్యలను కొనసాగిస్తోంది.