New Year Celebrations: ఒక్కరోజే ఓయోలో 6.2 లక్షల బుకింగ్స్
దేశవ్యాప్తంగా ఈ ఏడాది న్యూ ఇయర్ సెలబ్రేషన్స్‌ను ఒక్కొక్కరు ఒక్కో రకంగా జరుపుకున్నారు. పబ్‌లు, క్లబ్బుల్లో పార్టీలు చేసుకుంటూ కొందరు మత్తులో తూగితే.. మరికొందరు నచ్చిన ప్రదేశాలకు, రెస్టారెంట్లకు వెళ్లి ఎంజాయ్ చేస్తూ 2024కి గ్రాండ్ వెల్‌కమ్ చెప్పారు. న్యూ ఇయర్ కి ముందురోజైన డిసెంబర్ 31న భారీ సంఖ్యలో మద్యం కొనుగోళ్లు జరిగాయి. ఆ రోజున కేవలం మద్యం మాత్రమే కాదు.. బిర్యానీ ఆర్డర్లు, ఓయో రూమ్‌ల బుకింగ్‌లు, కండోమ్ ప్యాకెట్లు ఆర్డర్లు వంటివి రికార్డ్ స్థాయిలో చోటుచేసుకున్నాయి. ఇక ఫుడ్ డెలివరీ బాయ్స్‌కి టిప్స్ కూడా ఆ ఒక్కరోజులోనే రూ.97 లక్షల వరకూ వచ్చిందంటే.. మనదేశంలో ఎంతమంది 'దానకర్ణులు' ఉన్నారో అర్థం చేసుకోవచ్చు.
జొమాటోలో 2015-2020 మధ్య ఎన్ని ఆర్డర్లు అయితే బుక్ అయ్యాయో, అన్ని ఆర్డర్లు ఒక్క 2023 డిసెంబరు 31నే జరిగాయి. దాదాపు 3.2 లక్షల మంది జొమాటో డెలివరీ పార్టనర్లు ఈ ఆర్డర్లను అందించారని కంపెనీ తెలిపింది. మరో ఫుడ్ డెలివరీ యూప్ స్విగ్గీ... న్యూ ఇయర్ సందర్భంగా ఒక్క హైదరాబాద్‌లోనే ఏకంగా 4.8 లక్షల బిర్యానీ ప్యాకెట్లు డెలివరీ చేసినట్లు తెలిపింది. ప్రతి నిమిషానికి 1,244 ఆర్డర్లు వచ్చాయని పేర్కొంది. చివరి గంటలో సుమారుగా 10 లక్షల మంది స్విగ్గీ యాప్‌ను ఉపయోగించారని ఆ కంపెనీ CEO రోహిత్ కపూర్ తెలిపారు.
న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ సమయంలో ప్రతి గంటకు 1722 యూనిట్ల కండోమ్స్ ఆర్డర్లు వచ్చాయని స్విగ్గీ ఇన్‌స్టామార్ట్ తెలిపింది. ఇక ఓయో రూమ్ బుకింగ్స్ కూడా రికార్డ్ స్థాయిలో జరిగాయి. గతేడాదితో పోల్చితే ఈ సంవత్సరం 37 శాతం (6.2 లక్షల) రూమ్ బుకింగ్స్ జరిగాయి. కేవలం డిసెంబర్ 30, 31 తేదీల్లోనే ఏకంగా 2.3 లక్షల ఓయో రూమ్స్ బుక్ అయ్యాయి. ఇక్కడ విశేషం ఏమిటంటే, హిందూ పవిత్ర స్థలమైన అయోధ్యలో గతేడాదితో పోలిస్తే 70 శాతం అధికంగా, గోవాలో 50%, నైనిటాల్లో 60% ఎక్కువగా ఓయో రూమ్స్ బుక్ అయ్యాయి. ఈ విషయాన్ని ఓయో ఓ ప్రకటనలో పేర్కొంది.