మహిళలకు కేంద్ర ప్రభుత్వం రూ.6 వేల ఆర్ధిక సాయం.. ఎలా పొందాలంటే.?

Update: 2023-07-31 06:23 GMT

కేంద్ర ప్రభుత్వం మహిళలకు సాధికారత కల్పించేందుకు, వారికి ఆర్థిక సహాయం అందించేందుకు అనేక పథకాలను అమలు చేస్తోంది. అందులో భాగంగానే ప్రధాన మంత్రి మాతృత్వ వందన యోజన పథకం(PMMVY)లో భాగంగా గర్భిణులకు రూ.6 వేలు ఇస్తోంది. ఈ సాయం మొత్తం నేరుగా కేంద్ర ప్రభుత్వం నుంచి మహిళల ఖాతాలోకి వస్తుంది. దేశవ్యాప్తంగా పోషకాహార లోపంతో బాధపడుతున్న పిల్లల సమస్యను దృష్టిలో ఉంచుకుని, భారత ప్రభుత్వం మాతృత్వ వందన యోజనను ప్రారంభించింది. ప్రసవానికి ముందు, తర్వాత గర్భిణులు తమ బిడ్డల సంరక్షణకు, రోగాల బారిన పడకుండా కేంద్ర ప్రభుత్వం ఆర్థిక సాయం అందజేస్తుంది. ఈ కేంద్ర ప్రభుత్వ పథకాన్ని పొందేందుకు ఎవరెవరు దరఖాస్తు చేసుకోవచ్చో ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాం.

గర్భధారణ సమయంలో పోషకాహారం చాలా ముఖ్యం. పుట్టే బిడ్డ ఆరోగ్యంతో ఉండాలని, అందుకోసం వారి మాతృమూర్తులకు దశల వారీగా రూ. 6000 ఇస్తోంది కేంద్ర ప్రభుత్వం. ప్రధానమంత్రి మాతృత్వ వందన యోజన (పీఎంవీవై) కింద తొలి కాన్పులో ఆడ లేదా మగ బిడ్డ పుట్టినప్పటికీ మూడు దశల్లో రూ.5వేలు చెల్లిస్తోంది. మహిళ గర్భం దాల్చినట్లు ఆన్‌లైన్‌లో నమోదుకాగానే రూ.1,000, ఆరు నెలల తర్వాత రూ.2,000, ప్రసవం జరిగిన 14 వారాల్లో ఇమ్యూనైజేషన్‌ సైకిల్‌ పూర్తయ్యాక రూ.2,000 చొప్పున అందజేస్తుంది. ఈ పథకంలో రెండో కాన్పునకు ఆర్థిక లబ్ధి వర్తించేది కాదు. దీన్ని సవరిస్తూ.. రెండో కాన్పులో అమ్మాయి పుడితే మాత్రమే తల్లికి రూ.6వేలు ఇచ్చేలా మార్పుచేశారు. రెండో ప్రసవంలో కవలలు జన్మించి, వారిలో ఒక అమ్మాయి ఉన్నా పథకం వర్తిస్తుంది. జనన ధ్రువీకరణ పత్రం ఆధారంగా ఈ మొత్తాన్ని చెల్లిస్తారు. ఇక, తొలిసారి గర్భం దాల్చినప్పుడు మూడు దశల్లో అందించే రూ.5వేల ఆర్థిక సహాయం పంపిణీలోనూ మార్పులు చేయబోతుంది. గర్భం దాల్చినప్పుడు రూ.3,000, ప్రసవం జరిగిన 14 వారాలకు రూ.2,000 చొప్పున రెండు విడతల్లోనే ఇవ్వనుంది. ప్రసవం ప్రభుత్వ ఆస్పత్రిలో చేయించకుంటే అదనంగా మరో వెయ్యి అందిప్తారు.

ఎలా అప్లై చేయాలంటే

• ఈ పథకం కోసం దరఖాస్తు చేసుకునే గర్భిణీ స్త్రీల వయస్సు 19 సంవత్సరాల కంటే తక్కువ ఉండకూడదు.

• ఈ పథకాన్ని పొందాలనుకుంటే అధికారిక వెబ్‌సైట్ wcd.nic.in/schemes/pradhan-mantri-matru-vandana-yojanaని సందర్శించవచ్చు.

• గర్భందాల్చిన మహిళలు మూడవ నెలలో తమ పేర్లను ఆరోగ్య కార్యకర్తల వద్ద నమోదు చేసుకోవాలి

• మీరు ఈ వెబ్‌సైట్ నుండి ఫారమ్‌ను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు, దరఖాస్తును పూరించి సంబంధిత కార్యాలయంలో సమర్పించవచ్చు.

• అంగన్‌వాడీలో లేదా హెల్ప్‌లైన్ నంబర్ 7998799804కు కాల్ చేయడం ద్వారా మరింత సమాచారం అందుబాటులో ఉంటుంది.

• తల్లిదండ్రుల ఆధార్ కార్డ్, తల్లిదండ్రుల గుర్తింపు కార్డు, పిల్లల జనన ధృవీకరణ పత్రం మరియు బ్యాంక్ ఖాతా పాస్ బుక్ తప్పనిసరి

• ప్రధాన మంత్రి మాతృత్వ వందన యోజన జనవరి 1, 2017న ప్రారంభమైంది. దేశవ్యాప్తంగా ఉన్న గర్భిణీ స్త్రీలందరూ ఈ పథకాన్ని పొందవచ్చు.



Tags:    

Similar News