Manohar Joshi: లోక్‌సభ మాజీ స్పీకర్ మనోహర్ జోషి కన్నుమూత
మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, లోక్‌సభ మాజీ స్పీకర్ మనోహర్ జోషి కన్నుమూశారు. కార్డియాక్ అరెస్ట్‌తో ఆయన ఐసీయూలో చికిత్స పొందుతూ మరణించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు రెండు రోజుల క్రితం గుండెపోటుతో ముంబయిలోని పి.డి.హిందుజా ఆసుపత్రిలో చేరిన ఆయన ఈ రోజు తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు. ఈరోజు మధ్యాహ్నం ముంబయిలో అంత్యక్రియలు జరగనున్నాయి. ఆయన పరిస్థితి విషమంగా ఉన్నట్లు గురువారం సాయంత్రమే ఆసుపత్రి వర్గాలు ప్రకటించాయి. గత ఏడాది మేలోనూ మెదడులో రక్తస్రావం కారణంగా హాస్పిటల్‌లో చేరారు. కొన్ని రోజుల చికిత్స అనంతరం ఆయన కోలుకుని క్షేమంగా ఇంటికి వెళ్లారు. మళ్లీ ఆరోగ్యం దెబ్బతినడంతో చికిత్స పొందుతూ ఈ ఉదయం మరణించారు. జోషి మృతిపట్ల పలువురు నేతలు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.
1995లో బీజేపీతో శివసేన సంకీర్ణం అయ్యాక మహారాష్ట్రలో శివసేన నుంచి తొలిసారిగా ముఖ్యమంత్రి పదవి పొందిన వ్యక్తి మనోహర్ జోషి . 1966లో శివసేన స్థాపించాక అప్పటినుంచీ జోషి అందులో సభ్యునిగా కొనసాగుతున్నారు. లోక్‌సభకు గతంలో స్పీకర్‌గా వ్యవహరించారు. ముంబై మేయర్‌గా సేవలందించారు. మహారాష్ట్ర శాసనసభలో విపక్షనేతగా కొనసాగారు. అటల్ బిహారీ వాజ్‌పేయీ హయాంలో కేంద్ర భారీ పరిశ్రమల శాఖ మంత్రిగా పనిచేశారు. 1937 డిసెంబర్ 2న నాంద్వీలో జోషి జన్మించారు. విద్యాభ్యాసం మొత్తం ముంబయిలో సాగింది. సతీమణి అనఘ మనోహర్ జోషి 2020లో మరణించారు. ఆయనకు ఓ కుమారుడు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు