Harish Salve : 68 ఏండ్ల వయసులో మూడో పెళ్లి చేసుకున్న టాప్ అడ్వొకేట్..
మాజీ సొలిసిటర్ జనరల్ హరీష్ సాల్వే మళ్లీ ఓ ఇంటివాడయ్యాడు. 68 ఏండ్ల వయసులో ముచ్చటగా మూడో పెళ్లి చేసుకున్నారు. ఆదివారం లండన్లో అట్హాసంగా జరిగిన వేడుకలో త్రినా అనే మహిళను మనువాడాడు. ఈ పెళ్లికి టాప్ ఇండస్ట్రియలిస్ట్ ముకేష్ అంబానీ, ఆయన భార్య నీతా అంబానీ హాజరై కొత్త దంపతులకు శుభాకాంక్షలు చెప్పారు. వీరితో పాటు సునీల్ మిట్టల్, ఎల్‌ఎన్ మిట్టల్, ఎస్వీ లోహియా, గోపీ హిందూజా, లలిత్ మోదీ, ఉజ్వల్ రౌత్ తదితర ప్రముఖులు పెళ్లికి హాజరైన వీడియోలు, ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
సీనియర్ న్యాయవాది అయిన హరీష్ సాల్వేకి ఇది మూడో పెళ్లి. మొదటి భార్య మీనాక్షితో ఆయనకు సాక్షి, సానియా అనే ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. 2020లో దాదాపు 30 ఏండ్ల వైవాహిక జీవితానికి ముగింపు పలుకుతూ సాల్వే, మీనాక్షిలు విడాకులు తీసుకున్నారు. అదే ఏడాది ఆయన కరోలిన్ బ్రోసార్డ్ ను పెళ్లి చేసుకున్నారు. అయితే ఆ బంధం ఎక్కువ కాలం నిలవలేదు. ఆమెకు విడాకులు ఇచ్చిన సాల్వే తాజాగా త్రినాను మూడో పెళ్లి చేసుకున్నాడు.
హరీష్ సాల్వే అనేక సంచలన కేసులను వాదించారు. 1999 నవంబర్ నుంచి 2002 నవంబర్ వరకు దేశ సొలిసిటర్ జనరల్‌గా పనిచేశారు. గూఢచర్యం ఆరోపణలపై పాకిస్థాన్ మిలటరీ కోర్టు మరణశిక్ష విధించిన కులభూషణ్ జాదవ్ కేసు సహా పలు కేసులను సాల్వే వాదించారు. ఈ కేసు వాదించినందుకుగానూ సాల్వే కేవలం రూ. 1 మాత్రమే లీగల్ ఫీజుగా తీసుకొన్నారు. టాటా గ్రూప్, రిలయన్స్ ఇండస్ట్రీస్, ఐటీసీ గ్రూప్ వంటి వారు సాల్వేకు క్లయింట్స్ గా ఉన్నారు. 2015లో హరీష్ సాల్వేను భారత అత్యున్నత పురస్కారాల్లో ఒకటైన ‘పద్మ భూషణ్’ వరించింది.