రెచ్చిపోయిన మిలిటెంట్లు.. మణిపూర్లో మళ్లీ చెలరేగిన హింస..

Byline :  Kiran
Update: 2024-01-17 10:16 GMT

ఈశాన్య రాష్ట్రం మణిపూర్‌లో మరోసారి హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయి. భారత్‌-మయన్మార్‌ సరిహద్దుల్లోని మోరేలో భద్రతా బలగాల పోస్ట్‌పై మిలిటెంట్లు బాంబులు, రాకెట్‌ గ్రనేడ్లతో దాడి చేశారు. ఈ ఘటనలో ఓ పోలీసు కమాండో మృతి చెందారు. ఈ ఘటనలో కమాండో పోస్ట్‌ వద్ద నిలిపి ఉన్న పలు వాహనాలు ధ్వంసమయ్యాయి. మిలిటెంట్ల దాడితో వెంటనే అప్రమత్తమైన భద్రతా బలగాలు దాన్ని తిప్పికొడుతున్నాయి. ప్రస్తుతం మోరేలో భీకర కాల్పులు కొనసాగుతున్నట్లు సమాచారం.

మోరేలో ఇటీవల ఓ పోలీసు అధికారి హత్య జరిగింది. ఈ కేసులో ఇద్దరు అనుమానితులను పోలీసులు అరెస్టు చేయడంతో రెండ్రోజుల క్రితం కుకీ గ్రూప్‌లు పెద్దఎత్తున ఆందోళన చేపట్టాయి. రాష్ట్ర పోలీసులను మోరే నుంచి పంపి వేయాలని డిమాండ్‌ చేశాయి. ఈ క్రమంలోనే తాజాగా కమాండో పోస్ట్‌పై దాడి జరిగింది. కుకీ మిలిటెంట్లే ఈ దాడికి పాల్పడి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. తాజా ఘటనల నేపథ్యంలో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో కర్ఫ్యూ కొనసాగిస్తున్నారు. గతేడాది మణిపూర్లో చెలరేగిన ఘర్షణలు కొన్ని నెలల పాటు కొనసాగాయి. పలు ప్రాంతాల్లో హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్నాయి. వీటిలో 180 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. 

Tags:    

Similar News