ఎంపీ టికెట్, సినిమా ఛాన్స్‌లు.. సీమా హైదర్ ఎందుకింత ఫేమస్.?
పబ్జీ గేమ్‌తో ప్రేమలో పడి భారత్‌కు అక్రమంగా వచ్చిన పాక్ మహిళ సీమా హైదర్‌కు.. వరుస ఆఫర్లు వస్తున్నాయ. సీమకు 2024 లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేసేందుకు టికెట్ ఇస్తామని ప్రకటించింది ఓ రాజకీయ పార్టీ. రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా (అఠావలే) ఇచ్చిన ఈ ఆఫర్‌ను సీమ అంగీకరించినట్లు తెలిసింది. ఈ మేరకు రిపబ్లికన్ పార్టీ ఉపాధ్యక్షుడు మఖన్ కిషోర్ ఓ వీడియో విడుదల చేశారు. సెక్యూరిటీ ఏజెన్సీలు సీమ హైదర్‌కు క్లీన్ చిట్ ఇస్తే.. పార్టీలోకి ఆమెను స్వాగతించేందుకు సమస్యలేం లేవని కిషోర్ అన్నారు. సీమ అద్భుతమైన వక్త అని.. ఆమెకు తమ పార్టీలో అధికార ప్రతినిధి పదవి కూడా ఇవ్వవచ్చు అని కిషోర్ అన్నారు.
కాగా, ఆర్పీఐ జాతీయ అధ్యక్షుడు రాందాస్ అఠావలే.. మోదీ ప్రభుత్వంలో రెండోసారి కేబినెట్ మంత్రిగా ఉన్నారు. 'సీమ కేసును.. పోలీసులు, కేంద్ర సంస్థలు దర్యాప్తు చేస్తున్నాయి. ఇప్పటి వరకు జరిగిన విచారణలో ఆమెకు వ్యతిరేకంగా ఎలాంటి ఆధారాలు దొరకలేదు. ఒకవేళ ఆమెకు క్లీన్ చిట్ ఇస్తే.. మా పార్టీలోకి చేర్చుకోవాలని కోరుకుంటున్నా. ఆమె కావాలనుకుంటే 2024 ఎన్నికల్లో మా పార్టీ నుంచి పోటీ చేసేందుకు టిక్కెట్ ఇస్తాం' అని కిషోర్ అన్నారు.
అయితే, దీనికంటే ముందు సీమా హైదర్ సినిమా ఛాన్స్ కొట్టేసింది. ఉదయ్‌పుర్ టైలర్ కన్హయ్య లాల్ హత్య ఘటనపై 'ఏ టైలర్ మర్డర్ స్టోరీ' పేరిట ఓ చిత్రాన్ని జానీ ఫైర్‌ఫాక్స్ ప్రొడక్షన్ హౌస్ త్వరలో తెరకెక్కించనుంది. ఈ సినిమాలో 'రా' ఏజెంట్ పాత్ర కోసం సీమాను సంప్రదించారు. ఈ మేరకు చిత్ర దర్శకులు జయంత్ సిన్హా, భరత్ సింగ్‌లు మంగళవారం ఆమెకు ఆడిషన్ కూడా నిర్వహించి ఓకే చేశారు. పబ్జీ గేమ్ ఆడిన వ్యక్తి పరిచయంతో దేశంలోకి వచ్చిన సీమా హైదర్ గురించి ప్రస్తుతం దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. ఆమెను హైలెట్ చేస్తూ కొన్ని వార్త కథనాల్లో రావడంపై జనాల్లో ఆసక్తి పెరిగింది. ఈ ఆసక్తిని తమకు అనుకూలంగా మార్చుకోవాలని రాజకీయ పార్టీ వ్యక్తులు, సినీ ఇండస్ట్రీ కి చెందిన వ్యక్తులు భావిస్తున్నారు.