పరారీలో జయప్రద.. పోలీసులకు కోర్టు కీలక ఆదేశాలు

Update: 2024-02-27 16:06 GMT

సీనియర్ నటి జయప్రద జైలు శిక్షను అనుభవించేలా ఉన్నారు. ప్రస్తుతం ఆమె పరారీలో ఉన్నారంటూ ఉత్తరప్రదేశ్ లోని స్పెషల్ కోర్టు ప్రకటించింది. కోర్టు ఆదేశాలను ఆమె పాటించకపోవడంతో ప్రస్తుతం ఆమె కోసం పోలీసులు గాలిస్తున్నారు. 2019లో ఎన్నికల కోడ్ ఉల్లంఘించినట్లు జయప్రదపై రెండు కేసులు నమోదయ్యాయి. ఆ కేసులు కోర్టు విచారణకు కూడా వచ్చాయి. ఆ విచారణలకు సంబంధించి జయప్రదపై ఏడుసార్లు నాన్ బెయిలబుల్ వారెంట్లు జారీ అయ్యాయి. అయినా కూడా జయప్రద కోర్టు మెట్లెక్కలేదు.

కోర్టు విచారణకు జయప్రద హాజరుకాకపోవడం వల్ల జడ్జి శోభిత్ బన్సాల్ జిల్లా ఎస్పీకి కీలక ఆదేశాలు జారీ చేశారు. పరారీలో ఉన్న జయప్రదను వెంటనే కోర్టులో హాజరుపరచాలని, అందుకోసం ఓ స్పెషల్ టీమ్‌ను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. మార్చి 6వ తేదిలోపు కోర్టులో ఆమెను ప్రవేశపెట్టాలన్నారు. ఒక వేళ ఆమె కోర్టుకు హాజరుకాని పక్షంలో శిక్ష పడే అవకాశం ఉంది.

గతంలో జయప్రద రాజ్యసభ ఎంపీగాను, లోక్‌సభ ఎంపీగానూ పనిచేశారు. అయితే రాంపూర్ నియోజకవర్గంలో అజమ్ ఖాన్‌తో ఆమెకు వివాదం ఉంది. ఈ నేపథ్యంలో సమాజ్ వాదీ పార్టీ నుంచి ఆమె వైదొలగాల్సి వచ్చింది. ఆ పార్టీ నుంచి 2019లో బయటకు వచ్చి బీజేపీలో చేరారు. అయితే గత లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసిన ఆమె ఓడిపోయారు. ఆ సమయంలోనే ఎన్నికల కోడ్ ఉల్లంఘించారని ఆమెపై రెండు కేసులు నమోదయ్యాయి. అప్పటి నుంచి జయప్రద కోర్టు విచారణకు హాజరుకాలేదు. దీంతో కోర్టు సీరియస్ అయ్యింది.

Tags:    

Similar News