Ayodhya Ram Mandir : అయోధ్యలో పూర్తైన బంగారు తలుపుల బిగింపు.. తయారు చేసింది ఎవరో తెలుసా..?
అయోధ్యలో సంబురాలు ప్రారంభమ్యయాయి. ప్రాణ ప్రతిష్ఠకు ముందు జరిగే సంప్రదాయ క్రతువులు కొనసాగుతున్నాయి. మరో ఆరు రోజుల సమయం మాత్రమే ఉండటంతో ఆలయంలో పనులు శరవేగంగా పూర్తి చేస్తున్నారు. తాజాగా అయోధ్య రామయ్య కొలువుదీరనున్న గర్భగుడి బంగారు ద్వారం బిగించారు. దీనికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. ఈ బంగారు తలుపు ధర కోటి రూపాయల పైమాటే. ఇలాంటివి దాదాపు 18 బంగారు రేకు తలుపులు అమర్చారు. గర్భగుడిలో ఏర్పాటు చేసిన బంగారు తలుపుపై ఆకృతులను చాలా అందంగా చెక్కారు.
అయోధ్యలోని రామ మందిరంలో బిగించిన తలుపులు హైదరాబాద్ న్యూ బోయినపల్లిలోని అనురాధ టింబర్ డిపోలో రూపుదిద్దుకున్నాయి. తమిళనాడుకు చెందిన కుమారస్వామి, రమేశ్‌తో పాటు 60 మంది నిపుణులైన కళాకారుల బృందం వాటి తయారీ కోసం రాత్రింబవళ్లు కష్టపడింది. తలుపుల తయారీకి బలార్షా టేకు ఉపయోగించారు. బంగారు రేకులతో కూడిన 18 ప్రధాన ద్వారాల తలుపులతో పాటు మరో 100 తలుపులను సిద్ధం చేశారు. అయోధ్య రామ మందిర ప్రాణ ప్రతిష్ఠ కోసం గతేడాది ఏర్పాట్లు మొదలవ్వగానే రామ మందిరం ద్వారాలను తయారు చేయడం కోసం ఎల్ అండ్ టీ, టాటా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఆధ్వర్యంలో మే నెలలో ఇంటర్వ్యూలు నిర్వహించి గతంలో యాదాద్రి లక్ష్మీ నరసింహ స్వామి దేవాలయం, ఇతర ఆలయాని కోసం పనిచేసిన అనురాధ టింబర్ డిపోకు ఆ బాధ్యత అప్పగించారు.
అయోధ్య తలుపులపై వైభవానికి చిహ్నాలుగా గజం , విష్ణు కమలం చిత్రీకరించారు. ఒక్కో బంగారు తలుపు దాదాపు 12 అడుగుల ఎత్తు, 8 అడుగుల వెడల్పు ఉంటుంది. గర్భగుడిలో ఒక ద్వారం మాత్రమే ఉంటుంది. రామ మందిరంలోని తలుపులకు 100 కేజీల బంగారంతో పూత పూశారు.