ది కేరళ స్టోరీ చూపించిన సాధ్వీ.. అయినా ప్రియుడితో జంపైన యువతి

Update: 2023-06-08 09:13 GMT

ఆ అమ్మాయి వయసు 20 ఏండ్లు. ముస్లిం యువకుడితో ప్రేమలో పడింది. వెతికి పట్టుకున్న కుటుంబసభ్యులు ఆమెను తమ ఎంపీ సాధ్వీ ప్రజ్ఞాసింగ్ వద్దకు తీసుకెళ్లారు. అలా చేయడం సరికాదని సర్ది చెప్పిన సాధ్వీ ఆమెకు ఓ సినిమా చూపించారు. అమ్మాయి మనసు మార్చుకుందని అంతా అనుకుంటున్న సమయంలో సదరు యువతి ఊహించని షాక్ ఇచ్చింది.

భోపాల్కు చెందిన 20 ఏండ్ల యువతి నర్సింగ్ చదువుతోంది. తన క్లాస్మేట్ ద్వారా ఆమె సోదరుడైన యూసఫ్తో పరిచయమైంది. అదికాస్తా ప్రేమగా మారింది. దీంతో ఆ యువతి మే 11న యూసఫ్తో ఇంట్లో నుంచి వెళ్లిపోయింది. దీంతో ఆమె కుటుంబ సభ్యులు తమ ఎంపీ సాధ్వీ ప్రజ్ఞా సింగ్ వద్దకు వెళ్లారు. దీంతో ఆమె సదరు యువతి ఆచూకీ కనుక్కొని తల్లిదండ్రులకు అప్పగించారు. ఆ తర్వాత తనతో పాటు ఆ యువతిని ది కేరళ స్టోరీ సినిమాకు తీసుకెళ్లారు. మూవీ చూశాక ఆ అమ్మాయి మనసు మార్చుకుంటుందని అంతా భావించారు.

నాలుగు రోజులు గడిచాయి. మే 15 ఉదయం యువతి కుటుంబసభ్యులు నిద్రలేచే సరికి అమ్మాయి కనిపించలేదు. తెలిసిన వారందరినీ అడిగినా ప్రయోజనం లేకుండా పోయింది. ఇంట్లో ఉన్న రూ.70వేల నగదు, బంగారం కనిపించలేదు. ఇంతలో సదరు యువతి తన తల్లిదండ్రులకు ఓ వీడియో పంపింది. తాను మేజర్నని ఏం చేయాలో తనకు తెలుసునని చెప్పింది.

యువతి మిస్ కావడంతో పేరెంట్స్ పోలీసులను ఆశ్రయించారు. అయితే కంప్లైంట్ తీసుకునేందుకు వారు నిరాకరించారని వాపోతున్నారు. పిండి గిర్నీ నడిపే యూసఫ్ చాలా కేసుల్లో నిందితుడిగా ఉన్నాడని, అతనిపై రౌడీ షీట్ కూడా ఉందని అంటున్నారు. అతను తమ బిడ్డను ఏం చేస్తాడోనని ఆందోళన చెందుతున్నారు. మరోవైపు యూసఫ్ తండ్రి మాత్రం తమ కొడుకు ఏమైపోయాడో తెలియదని అంటున్నారు. పోలీసులు మాత్రం కేసు నమోదుచేశామని యువతి ఆచూకీ దొరికిన తర్వాత ఆమె స్టేట్మెంట్ ఆధారంగా తదుపరి చర్యలు తీసుకుంటామని అంటున్నారు.

Tags:    

Similar News