బాలికపై కామాంధుడి ఆకృత్యం.. సాయం అడిగితే పట్టించుకోని జనం..

By :  Bharath
Update: 2023-09-27 09:04 GMT

మధ్యప్రదేశ్లో సభ్య సమాజం తలదించుకునే ఘటన జరిగింది. ఓ కామాంధుడి కావరానికి బలైన పాప నరకం అనుభవించింది. రక్తమోడుతూ సాయం కోసం అర్థించినా.. ఎవరూ పట్టించుకున్న పాపాన పోలేదు. పైగా ఛీ పొమ్మంటూ వెళ్లగొట్టారు. చివరకు ఓ ఆశ్రమ నిర్వాహకుల పెద్ద మనసుతో హాస్పిటల్ లో చేరి చికిత్స పొందుతోంది. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి.

ఉజ్జయినికి 15 కిలోమీటర్ల దూరంలోని బాద్‌నగర్ రోడ్డులో ఈ ఘటన జరిగింది. 12 ఏండ్ల బాలికపై ఓ కామాంధుడు అత్యాచారం చేశాడు. దీంతో తీవ్ర గాయాలపాలైన ఆ పాప జననాంగాల నుంచి రక్తం కారుతోంది. ఒంటిపై సరైన బట్టలు కూడా లేకుండా వీధుల్లో తిరుగుతూ కనిపించిన వారిని సాయం కోరింది. అయితే ఆ చిన్నారికి సాయం చేసేందుకు ఎవరూ ముందుకురాలేదు.

వీడియోలో ఆ పాప ఇంటి బయట నిల్చున్న ఓ వ్యక్తి వద్దకు వెళ్లి సాయం కోరేందుకు ప్రయత్నించింది. అయితే సదరు వ్యక్తి ఏం జరిగిందో కూడా తెలుసుకోకుండా రక్తమోడుతున్న ఆ బాలికను చీదరించుకున్నాడు. చీ పొమ్మంటూ వెళ్లగొట్టాడు. ఈ దృశ్యాలన్నీ అక్కడి సీసీ కెమెరాలో రికార్డయ్యాయి.

ఎవరిని అడిగినా సాయం చేయకపోవడంతో దిక్కుతోచని స్థితిలో సదరు బాలిక చివరకు ఓ ఆశ్రమానికి వెళ్లింది. ఆ పాప పరిస్థితి గమనించిన ఆశ్రమ నిర్వాహకులు ఒంటిపై టవల్ కప్పి స్థానిక హాస్పిటల్కు తరలించారు. ఆమెపై అత్యాచారం జరిగిందని డాక్టర్లు స్పష్టం చేశారు. అయితే గాయాల తీవ్రత ఎక్కువగా ఉండటంతో ఆ పాపను ఇండోర్ హాస్పిటల్ కు పంపారు. ప్రస్తుతం ఆ చిన్నారి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు సమాచారం.

ఆస్పత్రి సిబ్బంది ఇచ్చిన సమాచారం మేరకు పోలీసులు పోక్సో చట్టం కింద కేసు నమోదుచేశారు. స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం ఏర్పాటు చేశామని నిందితున్ని వీలైనంత తొందరగా పట్టుకుంటామని చెప్పారు. ఇదిలా ఉంటే బాధితురాలు తన పేరు, ఇంటి అడ్రస్ వివరాలు స్పష్టంగా చెప్పలేకపోతోంది. ఆమె యాస ఆధారంగా యూపీ ప్రయాగ్‌రాజ్‌ ప్రాంతానికి చెందిన బాలిక అయి ఉంటుందని భావిస్తున్నారు.

Tags:    

Similar News