Gobi Manchurian Ban : చైనీస్ ఫుడ్ లవర్స్కు షాక్.. గోవాలో గోబీ మంచూరియాపై నిషేధం..

Byline :  Kiran
Update: 2024-02-06 10:37 GMT

చైనీస్ ఫుడ్ లవర్స్ కు గోవా బ్యాడ్ న్యూస్ చెప్పింది. గోవాలో గోబీ మంచూరియాపై బ్యాన్ విధించారు. అపరిశుభ్ర వాతావరణంలో తయారు చేయడంతో పాటు ఆ ఫుడ్ ప్రిపరేషన్లో ప్రమాదకర సింథటిక్ కలర్స్ వాడుతున్నారని ఆరోపణలు వచ్చాయి. బట్టలు ఉతికేందుకు ఉపయోగించే పౌడర్లను సాస్ తయారీలో వాడుతున్నారని జనం మండిపడుతున్నారు. దీంతో గోబీ మంచూరియాపై జనాల్లో తీవ్ర వ్యతిరేకత వచ్చింది. ఫలితంగా స్థానిక జిల్లా యంత్రాంగాలు ఒకదాని తర్వాత మరొకటి గోబీ మంచూరియాను బ్యాన్ చేస్తున్నారు.

గోవాలోని ప్రసిద్ధ బోడ్గేశ్వర ఆలయంలో నిర్వహించే జాతరలో గోబీ మంచురియాను నిషేధించాలని మపుసా మున్సిపల్ కౌన్సిల్ తీర్మానించింది. దీనికి సంబంధించి గత నెలలో ఓ తీర్మానం ప్రవేశపెట్టగా.. సభ్యులంతా ఏకగ్రీవంగా ఆమోదించారు. దీంతో వెంటనే మపుసా మున్సిపాలిటీలో గోబీ మంచూరియాపై నిషేధం అమల్లోకి వచ్చింది. ఇదిలా ఉంటే గోబీ మంచూరియా తయారీలో నాణ్యమైన వస్తువులను వాడుతున్నామని చైనీస్ ఫాస్ట్ ఫుడ్ స్టాల్ ఓనర్లు చెబుతున్నారు. అయితే ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ అధికారులు మాత్రం వారి మాటల్లో ఏ మాత్రం నిజం లేదని అంటున్నారు.

చైనీస్ స్టాళ్లలో మంచి క్వాలిటీ సాస్లను అందరికీ కనిపించేటట్లు పెడుతున్నా.. కస్టమర్లకు అందించే వాటిలో మాత్రం హానికరమైన పదార్థాలు ఉంటున్నాయని అధికారులు అంటున్నారు. గోబీ కరకరలాడుతూ ఉండేలా చేసేందుకు మొక్కజొన్న పిండిలో ఓ రకమైన పౌడర్ కలుపుతున్నారని ఆరోపిస్తున్నారు. సాధారణంగా ఫుడ్ స్టాళ్లలో ప్లేట్ గోబీ మంచూరియాకు రూ. 70 నుంచి 100 వసూలు చేస్తుండగా.. జాతరలో మాత్రం కేవలం రూ.30 నుంచి 40 రూపాయలు మాత్రమే తీసుకుంటున్నారని అంటున్నారు. నాణ్యతలేని, ప్రమాదకరమైన పదార్థాలను వాడుతున్నందుకే ఇలా తక్కువ రేటుకు అమ్ముతున్నారని చెబుతున్నారు.

ఇదిలా ఉంటే గోవాలో గోబీ మంచూరియాపై నిషేధం విధించడం ఇదే తొలిసారి కాదు. గతంలోనూ కొన్ని కౌన్సిల్స్ బ్యాన్ చేశాయి. మోర్ముగావ్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని శ్రీ దామోదర దేవాలయ వాస్కో సప్త జాతరలో గోబీ మంచురియా అమ్మకంపై ఆంక్షలు విధించారు. పోండాలోని కపిలేశ్వరి, సాతేరి దేవి జాతరలోనూ గోబీ మంచురియాను నిషేధించారు. 

Tags:    

Similar News