దూసుకెళ్తున్న బంగారం.. 65 వేలకు చేరుతుంది!

Update: 2023-10-21 13:05 GMT

బంగారం ధరలు తారాజువ్వల్లా దూసుకెళ్తున్నాయి. గత నాలుగు నెలలతో పోలిస్తే గరిష్ట స్థాయికి చేరుకున్నాయి. పాలస్తీనా-ఇజ్రాయెల్ ఘర్షణలు, పతనమవుతున్న అమెరికా డాలర్ విలువ, వడ్డీరేట్ల తగ్గుదల తదితర పరిణమాలు పసిడి ధరలకు మరింత ఆజ్యం పోస్తాయని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు. దసరా, దీపావళి సీజన్ కూడా ధరలకు ఊపునిచ్చిందని, హవా ఇలాగే కొనసాగితే పసిడి దీపావళి నాటికి రూ. 65 వేల నుంచి రూ. 68 వేలకు చేరుకునే అవకాశం ఉందని చెబుతున్నారు. ఈ ఏడాది మార్చి, ఏప్రిల్ నెలల్లో పసిడి ధరలు కొండెక్కినప్పుడు కూడా ఇదే అంచనా వేశారు. అయితే గత నాలుగు నెలలు నెలల్లో రోజురోజుకూ పడిపోతూ వస్తున్న ధరలు పది రోజులుగా పైపైకి దూసుకెళ్తూ దడ పుట్టిస్తున్నాయి.

శనివారం కూడా ధరలు పెరిగాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో 22 కేరట్ల పసిడి పది గ్రాములకు రూ. 200 పెరిగి రూ. 56,600కు చేరుకుంది. 24 కేరట్ల స్వచ్ఛమైన బంగారం ధర రూ. 220 పెరిగి రూ. 61,720కు చేరుకుంది. అంచనా ధరలకు తాజా ధర దాదాపు దగ్గర్లోనే ఉండడం గమనార్హం. పెరుగుదల ఇలాగే కొనసాగితే మరో 20 రోజుల్లో వచ్చే దీపావళి వేడుకల నాటికి పసిడి ధర రూ. 65 వేలు దాటిపోయినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని మార్కెట్ నిపుణులు అంటున్నారు. మరోపక్క వెండి ధరలకు కూడా రోజురోజుకూ పెరుగుతున్నాయి. శనివారం కేజీ వెండి ధర రూ. 1,200 పెరిగి రూ. 78,700కు చేరింది. రజతం ధరల్లోనూ పెరుగుదల కొనసాగితే కేజీ ధర దీపావళి నాటికి రూ. 82 వేల నుంచి రూ. 85 వేల మధ్యకు చేరుతుందని అంచనా.


Tags:    

Similar News